సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -411
అంధాక్షి మీలన న్యాయము
*****
అంధ అంటే గుడ్డియగు, చీకటి.అక్షి అనగా కన్ను మీలన అనగా మూయుట, ముడుచుకొనుట,మూసికొనుట అనే అర్థాలు ఉన్నాయి.
గుడ్డికన్ను మూసినా తెరిచినా ఒకటే అలాంటి కన్ను వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని అర్థము.
 ఇదే మాటను ముద్దు ఫళని  రాసిన రాధికా సాంత్వనంలో  వుండటం విశేషం.అందులో "గ్రుడ్డికన్ను దా మూయక యున్న నేమి మరి మూసిననేమి " అని వుంటుంది.
అయితే ఈ న్యాయము  అంధులైన వారిని విమర్శించినట్టు, కించపరిచినట్టు కాదు.అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా ఏపని చేయకుండా వుండే సోమరిని ఉద్దేశించి చెప్పినది వాళ్ళు గుడ్డికన్ను లాంటి వారని విసుగూ,విమర్శతో అన్న మాట అది.
అంతే కాదు కళ్ళుండీ జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోలేని వారిని కళ్ళున్న కబోదులు అంటారు. అలాంటి వారికి కళ్ళున్నా లేనట్లే.అలాంటి కళ్ళు గుడ్డి కళ్ళకిందే లెక్క. మరి అలాంటి కళ్ళు మూసినా తెరిచినా ఒకటే కదా!
ఇలా కళ్ళుండీ చూడలేని వారిని ఉద్దేశించి భాస్కర శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దామా...
"దాన పరోపకార గుణ ధన్యత చిత్తములోన నెప్పుడున్/లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ,సంపదల్/పూనిన వేళ,నొక్క సరిపోలును,జీకున కర్థరాత్రియం/దైన నదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా!"
కళ్ళు లేని వారికి రేయి పగలు తేడా ఎలా లేదో అదే విధంగా దానం చేసే బుద్ధి,పరోపకార గుణం లేని మూర్ఖుడు పేదరికంలో ఉన్నా ధనికుడైనా అట్టి భేదం లేదు అని అర్థము.
అలాంటి వారిని ఉద్దేశించి ఇంకో మాట కూడా  అంటాడు భాస్కర శతక కర్త.అది కూడా చూద్దామా..
 
తనకు నదృష్టరేఖ విశదంబుగ  గల్గినగాని లేనిచో/జనులకు నెయ్యడన్ బరుల సంపదల వల్ల ఫలంబు లేదుగా/కనుగవ లెస్సగా దెలివి గల్గిన వారికి గాక గ్రుడ్డికిన్/ కనబడునెట్లు వెన్నెలలుగాయగ నందొకరపు భాస్కరా!
వెన్నెల యొక్క అందము కళ్ళున్న వారికే అనగా ఇక్కడ కళ్ళుండటమే కాదు ఆస్వాదించే మనసు వుండటం.అది లేని వారికి వెన్నెల లోని అందము ఎలా తెలుస్తుంది.ఆస్వాదించలేని గుడ్డివారికి ఎలా తెలుస్తుంది.అదే విధంగా అదృష్టం వున్న వారికే భాగ్యం లభిస్తుంది. 
అది ఎలాంటి అదృష్టం అంటే అందులోని గొప్ప తనం తెలుసుకోగలిగిన అదృష్టం వుండాలి. అందుకే పెద్దలు అంటుంటారు. ఏదైనా సామాన్యంగా చూసే కళ్ళకూ, కళాత్మకంగా చూసే కళ్ళకు చాలా భేదం వుంటుందని. అలాంటి కళాత్మక హృదయం లేని వారికి గొప్ప శిల్పం కూడా బండరాయి లాగే కనిపిస్తుంది.
ఇలా "అంధాక్షి మీలన న్యాయము"లోని అంతరార్థం మనకు ఈపాటికి అర్థమై పోయింది.పని చేయని ఎలాంటి ప్రయోజనం లేని వ్యక్తుల గురించి పుట్టినది ఈ న్యాయము. మనము అలాంటి వారం కాదు కాబట్టి ఆ న్యాయము మనలాంటి వారికి అస్సలు వర్తించదు. అంతే కదండీ!"
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు