ప్రేమంటే; - కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, పాతర్లపాడు, ఖమ్మం.
నవనాడులను నులక మంచానికి అల్లి గుంజుతన్నట్ఠు
వేయి ఫిరంగులతో పేల్చి వేస్తున్నట్టు
కట్టెల అడ్తీలో మొద్దును రంపంతో కోస్తున్నట్టు
నొప్పులు పుట్టి ముంచి ప్రాణం తీస్తున్నా!!

కడుపులో నుంచి జారి కింద పడిన
కసుగాయ, రక్తపు ముద్ద, కెవ్వుమని కేక వేయగానే,
కళ్ళు తెరిచి వళ్ళు సలుపుతున్నా
కాళ్ళు చేతులు కూడదీసుకుని కౌగిలించుకుంటుంది!!

కళ్ళల్లో వేయి సూర్యుల కాంతిని ప్రసరించి
కనురెప్పలు మూసుకుంటుందే 
కానుపుతో కలిగిన తీపులు నొప్పులు మరచి,
కన్న తల్లి హాయిగా! అది అదే ప్రేమ !!

కాలికి చిన్న గాయమైనా చేతికి దెబ్బ తగిలినా
జ్వరంతో వణుకు వస్తున్నా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా
తనకే వచ్చినట్టు హడలిపోయి,భుజాన వేసుకుని
హాస్పిటల్ కు పరిగెత్తుకుంటూ వెళ్ళే నాన్నది ప్రేమ!!

ప్రేమ ! ఒక అనిర్వచనీయమైన అనుభూతిని
ఆనందాన్ని కలిగించి కాలగమనాన్ని మరిపించే శక్తి
నిరంతరం గంగా ఝరిలా అంతర్నాడులలో
ప్రవహించే అంతర్వాహిని ఈ లోకాన్ని నడిపే మంత్రం!!

ఎక్కడో పుట్టి ! ఎక్కడో పెరిగి! ఏకమైన జంట !
ఒకరిలో ఒకరు లీనమై ! ఏకోన్ముఖులై ! 
ఏకాత్మతో ! సకారాత్మక సంకల్ప సిద్ధి కోసం ! 
సమస్యలెదురైనా ఇరువురిని ఒకటిగా నడిపేది ప్రేమ!!

కామెంట్‌లు