సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -422
ఇక్షు దండ న్యాయము
   *****
ఇక్షు అనగా చెఱకు,దండ అనగా గడ, కఱ్ఱ,ముదరము,రాజ చిహ్నము, సన్యాసి ధరించు కఱ్ఱ.
చెఱకు గడలోని కణుపు ఒక దాని కన్న మరొకటి రుచిగా ఉంటుంది.
సజ్జన మైత్రి కూడా చెఱకు గడ లాంటిదేనని అర్థము.
చెఱకు అనగానే నోటికి తీయదనపు భావన కలుగుతుంది.సహజంగా తీయదనాన్ని ఇష్టపడని వారుంటారా? అసలు వుండరు.అందులోనూ చెఱకు గడ తీపిని.
కవుల సాహిత్యాన్ని, కవిత్వాన్ని  గురించి చెబుతూ ఫలానా కవి సాహిత్యం  'ఇక్షురస' పాకంలా వుందని,కదలీ పాకం, నారికేళ పాకంలా వుందని వర్ణిస్తూ చెప్పడం మనందరికీ తెలిసిందే.
మరి ఈ ఇక్షు దండం గురించి తెలుసుకుందామా...
సంస్కృత మరియు పాళీ భాషలో రాయబడిన గ్రంథాల్లో చక్కెర ఉత్పత్తి గురించి రాసి వుంది. సంస్కృత పదం శర్కర నుండి చెఱకు అనే పేరు వచ్చి వుంటుందని ఊహిస్తున్నారు.
ఇక్షుదండం అంటే చెరకు గడ.ఈ చెరకు గడ్డిజాతికి చెందిన తియ్యని కాండము గల మొక్క. దీని గడలు వెదురు గడలను పోలి కణుపులు కణుపులుగా వుంటాయి. ఇవి పొడవుగా వుంటాయి.వీటిని సాగు చేయడానికీ, చేయించడానికి కణుపుల వద్ద కత్తిరించి వాటినే నారుగా వాడుతారు.
 చెఱకు గడల్ని యంత్రాల సహాయంతో పిప్పి చేసి చెఱకు రసం తయారు చేస్తారు. ఈ రసంలో కొంచెం అల్లం తురుము,నిమ్మరసం, సబ్జాగింజలు వేసి  పిల్లలూ పెద్దలూ ఎంతో ఇష్టంగా సేవిస్తారు. చెఱకు రసం నుండి పంచదార, బెల్లం తయారు చేస్తారు.అంతే కాదు చెఱకును ఔషధాల తయారీలో కూడా వాడతారు. చెఱకు పిప్పిని బాయిలర్లలో మండించి ఆవిరి ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు.ఇంకా చెఱకు పిప్పితో కాగితం కూడా తయారు చేస్తున్నారు.ఈ చెఱకు కాగితం పర్యావరణానికి అనుకూలమైనదే కాకుండా పునర్వినియోగానికి అనుకూలమైనది.
ఇలా చెప్పుకుంటూ పోతే చెఱకు యొక్క ఉపయోగాలు చాలానే ఉన్నాయి.
 మరి  "ఇక్షు దండము"ను న్యాయముగా మన పెద్దలు చెప్పడానికి కారణం ఈ పాటికి కొంత అర్థమయ్యే వుంటుంది.
 చెఱకు గడలోని కణుపు కణుపుకూ తీయదనపు రుచి పెరుగుతుందట. అలాగే సజ్జన మైత్రి కూడా చెఱకు గడ కణుపుల్లా రోజు రోజుకూ తీయదనం పెరుగుతుందనే అర్థంతో ఈ "ఇక్షు దండ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 ఎలాంటి పరిచయాలైనా  ఎంతో కొంత కాలానికి మనస్పర్థలు రావడమో, విసుగును కలిగించడమో చేస్తాయి. కానీ స్నేహమనే పరిచయానికి ఎప్పటికీ విసుగు, విరామం వుండదు.రోజులు గడుస్తున్నా కొద్దీ అవగాహనా గాఢత పెరిగి ఆత్మీయమైన స్నేహ బంధం మరింత బలపడుతుంది.
 
కవి పొన్నికంటి తెలగన అచ్చ తెలుగులో రాసిన "యయాతి చరిత్ర"లో  దేవయానితో శర్మిష్టకు స్నేహం గురించి  "ఉసురొక్కటియై బొందులు/ వెస రెండుగ నుండు ..." అంటే  "శరీరాలు రెండూ వేరైనా ప్రాణం ఒక్కటిగా కలిసి మెలిసి ఉన్నాము" అనే వాక్యాన్ని ఓ పద్యంలో చెప్పిస్తాడు.
ఈ విధంగా చెఱకు గడలోని తీపిలా కణుపు కణుపుకూ  తీపి మరింత పెరిగినట్లుగా మరియూ పెరుగునట్లుగా మనమూ స్నేహిద్దాం.చూసే వాళ్ళకి,చవి చూసే వారికి 'ఇక్షు దండ' తీపి  రుచిని తెలిసేలా చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు