మనసులోని ముచ్చట్లు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తలుపులు తెరవాలని
బయటకు వెళ్ళాలని
రెక్కలు విప్పుకోవాలని
ఆకాశానికి ఎగిరిపోవాలని
మనసు ఉబలాటపడుతుంది

నోరు విప్పాలని
హితాలు చెప్పాలని 
తేనెను చిందాలని
తీపిగా పలుకాలని
మనసు ముచ్చటపడుతుంది

కాళ్ళు కదిలించాలని
చేతులకు పనిపెట్టాలని
వళ్ళు వంచాలని
ఘనకార్యాలు చేయాలని
మనసు కుతూహలపడుతుంది

పూతోటకు వెళ్ళాలని
పూలపొంకాలు కాంచాలని
పరిమళాలు పీల్చాలని
పరమానందంలో మునగాలని
మనసు ఉత్సాహపడుతుంది

కొండలు ఎక్కాలని
కోనలు కాంచాలని
సెలయేర్లు దర్శించాలని
ప్రకృతినిచూచి పరవశించాలని
మనసు ఆశపడుతుంది

జాబిలిని చూడాలని
వెన్నెలలో విహరించాలని
స్వేదతీరాలని
సుఖపడాలని
మనసు ఆరాటపడుతుంది

ప్రొద్దున్నే లేవాలని
ఉషోదయము చూడాలని
అరుణకిరణాలు వీక్షించాలని
దినచర్యలు ప్రారంభించాలని
మనసు కాంక్షిస్తుంది

అభిమానుల పొందాలని
ఆత్మీయుల సంపాదించాలని
అనురాగాలు పంచుకోవాలని
అంతరంగాన్ని తృప్తిపరచాలని
మనసు అభిలాషిస్తుంది

అక్షరాలు ఏరాలని
పదాలు పారించాలని
ప్రాసలు కలపాలని
కవితలు సృష్టించాలని
మనసు కోరుకుంటుంది

తలపులు తట్టాలని
భావాలు పుట్టాలని
విషయాలు దొరకాలని
మదులను దోచాలని
మనసు తహతహలాడుతుంది

ఏమి చెయ్యను?
మనసు చెప్పినట్లు
మసలుకుంటా
మారాము చేయకుండా
ముందుకెళతా


కామెంట్‌లు