సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -407
అధికార న్యాయము
   *****
అధికారము అనగా పర్యవేక్షణము,కర్తవ్యము, ప్రక్రియ,స్వతంత్రము,యోగ్య బాధ్యత,దొరతనము చెల్లుబడి,ఫలస్వామ్యము అనే అర్థాలు ఉన్నాయి.
అధికారము అనగా ఒకానొక వ్యక్తి లేదా సమూహము మరో జీవన శైలిని నిర్దేశించి నిర్వహించగల ఒక వ్యక్తి  లేదా సంస్థ యొక్క సామర్థ్యమే అధికారము.దీనిని ఆంగ్లంలో అథారిటీ అంటారు.
సమాజంలో ఏదైనా ఒక పని చేయడానికి, చేయించడానికి  అధికారము అనేది అవసరము. అది జీవన విధానాన్ని దత్తత తీసుకుని తన కనుసన్నలలో ఉంచుకుని నిర్వహించడాన్ని అధికారం అంటారు. దీనిలో అంతర్లీనంగా అధికారి ఆజ్ఞ పాలన వుంటుంది. ఏపనులైనా ఆయా వ్యక్తుల లేదా సంస్థల ఆధీనంలో వుంటాయి.
అధికారము అనే భావనలో అనేక నాయకత్వ లక్షణాలు యిమిడి వుంటాయి. అయితే అధికారము ఆయా వ్యక్తుల సామర్థ్యం,ఒక నిర్దిష్ట సామాజిక శక్తి యుక్తి,గుణగణాలపైన ఆధారపడి ఉంటుంది.
మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సామాజిక అధికార నిర్వహణలో వ్యక్తులకు ఉపయోగపడే విధంగానే  సూచనలు సలహాలు వుంటాయి కానీ వారికి కీడు చేయడం అనేది వుండదు.
కొన్ని అధికారాలు మాత్రం భౌతిక శక్తి మీద ఆధారపడి ఉంటాయి.అనగా అవి సంస్థాపరమైన అధికార వ్యవస్థ, వారి పని సామర్థ్యంపై ఆధారపడి వుండటం మనం గమనించవచ్చు.
అందుకే వేమన ఓ పద్యంలో ఇలా అంటాడు.
"అల్పబుద్ధి వాని కధికారమిచ్చిన/ దొడ్డవారినెల్ల తొలగగొట్టు/చెప్పుతినెడి కుక్క చెరకు తీపెరుగునా?/ విశ్వధాభిరామ వినురవేమ!
అనగా చెడ్డవ్యక్తికి అధికారం ఇస్తే మంచివారినందరినీ వెళ్ళగొడతాడు.హాని కలుగజేస్తాడు అని అర్థము.అదెలా అంటే కాలి చెప్పులను ఇష్టంగా తినే కుక్కకు చాలా తియ్యని మధురమైన చెరకు ఇస్తే తింటుందా? తినదు.దానికి ఆ చెరకులోని తీయదనం తెలియదు.అలాగే దుష్టుడైన వ్యక్తికి చెడుమాటలు,చేతలే నచ్చుతాయి కానీ మంచిమాటలు ఆ మంచి మాటలు చెప్పే వ్యక్తులు నచ్చరు.అందుకే తన అధికార బలంతో మంచివారిని యిబ్బంది పెడతాడు అని అర్థము.
 కాబట్టి అధికారము అనేది మంచి వారి చేతుల్లో ఉన్నప్పుడు సమాజంలోని వ్యక్తులకు మేలు జరుగుతుంది. అదే  చెడ్డ వారి చేతుల్లో వుంటే సమాజంలోని  వ్యక్తులకు హాని కలుగుతుంది.వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది. కాబట్టి  అధికారము వల్ల న్యాయము జరగాలంటే   మంచి మనసుండి చక్కని నాయకత్వ లక్షణాలను కలిగిన అధికారులు వుండాలి.
మరి మంచి అధికారులను ఎంచుకుని, అలాంటి నాయకత్వానికి పట్టం కట్టినప్పుడే వ్యక్తి,సమాజ శ్రేయస్సు జరుగుతుంది.
కాబట్టి మనం అధికార హోదాలో వుంటే మంచి పనులు చేసి శభాష్ అనిపించుకోవాలి. 
మనం సమాజంలో వ్యక్తిగా ఉన్నప్పుడు మనలాంటి వారిని కూడగట్టుకుని మంచి అధికారిని ఎన్నుకోవాలి. అప్పుడే ఈ "అధికార న్యాయము"నకు న్యాయం జరుగుతుంది.
ప్రభాత కిరణాల శుభాకాంక్షలతో 💐

కామెంట్‌లు