'హరీ!'శతకపద్యములు.- టి. వి. యెల్. గాయత్రి.- పూణే. మహారాష్ట్ర

 47.
చంపకమాల.
తురగపు రూపుడా ఖలుడు దుర్మతుడై నిను జంపబోవగన్
జిరజిరలాడి వాని నట  సింహపు పిల్లవిధంబు జీర్చగన్
బరుగున వచ్చి గోపకులు 'వహ్వ!'యటంచు జయంబుపల్క నిన్
మురియుచు గాంచుచున్ సురలు మ్రొక్కిరి పొంగుచు భక్తిగన్ హరీ!//
48.
ఉత్పలమాల.
చీరలు దోచి భామలను జేరగ రమ్మని మోక్షమార్గమున్
దీరుగ దెల్పినావు నిను 'దేవర!'వంచును  మ్రొక్కిగొల్లెతల్
కోరగ నీదు సంగతిని కూరిమి మీరగ తీర్చినావు నిన్
సారెకు దల్చి వేడెదను జ్ఞానపు భిక్షనొసంగుమా హరీ!//

కామెంట్‌లు
Parvateesamvepa చెప్పారు…
అమోఘమైన కవన ధారతో రమ్యమౌ పద బంధాలతో దృశ్యమాన కవనశిల్పంతో మీ భక్తిమయ పద్య రచన అతి ప్రశంసనీయమైనది.మీకు అనేక అభినందనలండీ.