సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -454
కరిణీ ప్రసవ న్యాయం
*****
కరిణి అంటే ఆడ ఏనుగు. ప్రసవం అంటే కాన్పు.
ఏనుగు ఒక కాన్పు లేదా ప్రసవంలో ఒకే ఒక్క శిశువుకు జన్మనిస్తుంది.
 కానీ పంది లేదా వరాహం పదికి పైగా పిల్లలకు జన్మనిస్తుంది.
పంది అన్ని పిల్లలను కన్నప్పటికీ  ఆ పిల్లలకు విలువ లేదు.అదే 'ఏనుగు ఒక్క పిల్లను కన్నా దానికి ఎంతో విలువ వుంటుంది' అనే అర్థంతో ఈ "కరిణీ ప్రసవ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 పురాణేతిహాసాలలో  నైనా నిత్య జీవితంలో నైనా ఏనుగుకు చాలా గౌరవప్రదమైన, విలువైన స్థానమే ఉంది.ఏనుగును బలానికి మరియు జ్ఞానానికి  కూడా సంకేతంగా భావిస్తారు. ఏనుగు తలతో ఉన్న గణపతిని విఘ్నాలు తొలగించే దేవుడుగా మనమంతా ఆరాధిస్తాం.స్వర్గ లోకాధిపతి  అయిన ఇంద్రుడి కొలువులో ఐరావతం అనే  తెల్లని ఏనుగు ఉండేదని , అలా ఇంద్రుడు తన వాహనమైన ఐరావతంపై  స్వారీ చేసేవాడని పురాణాలలో చదువుకున్నాం.
ఇక బుద్ధుని జననానికి ముందు తల్లి మాయాదేవికి తెల్లని ఏనుగు కలలోకి రావడం, దానిని శుభ సూచకంగా భావించడం బుద్ధుని జన్మ వృత్తాంతంలో చదువుకున్నాం.ఇలా ఏనుగును వైభవానికి, శుభానికి ప్రతీకగానే కాకుండా  దైవ సంబంధమైన కార్యాలకు కూడా ఉపయోగిస్తారు.
ఏనుగు అంబారీపై దేవుళ్ళను ఊరేగింపు చేస్తుండటం మనందరికీ తెలిసిందే.దీనిని బట్టి ఏనుగు యొక్క గొప్ప తనం,విలువ తెలిసిపోయింది కదా!.
అందుకే పందిని, ఏనుగును పోలుస్తూ  పందికి "పది పిల్లలు పుడితేనేం.వాటికేం  విలువ? ఏనుగుకు ఒక్క పిల్ల పుట్టినా గొప్పే" , 'ఎంతైనా ఏనుగు పిల్ల ఏనుగు పిల్లే!' పెద్దలు అనడం తరచూ వింటూనే వున్నాం.
దీనినే మనుషులకు వర్తింప చేస్తూ మన పెద్దవాళ్ళు " ఏనుగు పిల్లలా  ఉత్తముడైన వాడు ఒక్కడు పుట్టినా చాలు "అని  ఈ"కరిణీ ప్రసవ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 వేమన కూడా  ఇదే విషయాన్ని నొక్కి చెబుతూ తాను రాసిన పద్యంలో ఇలా అంటాడు...
"పందిపిల్లలీను పదునైదు నొక్కటి/ కుంజరంబు నీను కొదమ నొకటి/ నుత్తమపురుషుండు నొక్కడే చాలురా/ విశ్వధాభిరామ వినురవేమ!".
ఎక్కువ మంది అప్రయోజకులైన పిల్లలను కనేకంటే ఉత్తముడైన ఒక్కరిని కంటే చాలునని పద్యం యొక్క భావం.
మనం  మహాభారతాన్నే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.మహా భారతంలో  కౌరవులు సంఖ్యకు వంద మంది కానీ ఒక్కరు కూడా పేరు కీర్తి తెచ్చుకోలేదు కదా!.
 మరి పాండవులు ఐదుగురే అయినా ఉత్తములుగా, ఉన్నతులుగా, ధైర్య సాహసాలు, మానవతా విలువలు కలిగిన వారుగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.
ఒకప్పుడు  కుటుంబ నియంత్రణ పద్ధతులు లేవు.అందువల్ల  దేవుడు ఇచ్చిన సంతానమంటూ  చాలా సంతానాన్ని కంటూనే వుండేవారు.అంత మందిలో  ఏ ఒక్కడో,ఇద్దరో  మాత్రమే ప్రయోజకులు అయ్యే వారు.
రాన్రాను ఆర్థిక, కుటుంబ పరిస్థితులను బట్టి ఒకరిద్దరినీ మాత్రమే కంటున్నారు.చక్కగా చదువూ సంధ్యా చెప్పించి వారిని ఉన్నతంగా తీర్చి దిద్దుతున్నారు.
 కాబట్టి  నేడు "కరిణీ ప్రసవ న్యాయమే" అమలులో వుందన్న మాట.కాబట్టి వరాహాన్ని గురించి  చర్చించాల్సిన అవసరం లేదు. కానీ తాము కన్న  సంతానం ఒక్కరిద్దరైనా సరే, వారిని చక్కగా తీర్చిదిద్దితేనే ఇటు కుటుంబానికి,అటు సమాజానికీ, దేశానికీ ఎంతో మేలు కలుగుతుంది .ఈ విషయం ప్రతి తల్లీ తండ్రీ గ్రహించి నప్పుడే ఉత్తములైన సంతానంతో ఉత్తమమైన సమాజం ఏర్పడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏
కామెంట్‌లు