సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -448
కాకాధికరణ న్యాయము
*****
కాక అనగా కాకి, వాయసము, బలిపుష్టము, ధ్వాంక్షము, ఆత్మఘోషము అనే అర్థాలు ఉన్నాయి.అధికరణము అనగా ఆధారము.
కాకాధికరణము అనగా కాకిని ఆధారంగా చేసుకుని చెప్పడం.
 ఫలానా వారి ఇల్లు ఏది? అని అడిగితే అదిగో ఆ కాకి వాలి వున్న ఇల్లు అని చూపించడం. అనగా సరైన గుర్తులు,చిరునామా చెప్పకుండా అడిగిన ప్రశ్నకు ఆ సమయానికి కనిపించిన ఆధారము చూపి చెప్పడం.
ఇలా ఫలానా రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి నిలబడిన ఇల్లు,అదిగో బండి ఆపుకుని నిలబడ్డాడే అదే ఇల్లు... చెబుతూ ఉంటారు.
 అడిగిన ప్రశ్నకు సమాధానం విన్న  సదరు వ్యక్తి ఆనవాలు పట్టుకొని వెళ్ళేలోపు  అక్కడ నుండి కాకి ఎగిరిపోవచ్చు, వ్యక్తులూ కదిలిపోవచ్చు. అప్పుడిక అడిగిన వ్యక్తి పరిస్థితి అగమ్యగోచరమే.
 ఇదొక తరహా యిబ్బంది అయితే మరో రకమైన యిబ్బంది చూద్దాం.తిరుపతి వెంకన్న పేరో , భద్రాద్రి రామన్న పేరో ఊర్లో చాలా మంది పెట్టుకునే వారు.
 ఫలానా  వెంకటేశ్వరరావు లేదా రామారావు గారి ఇల్లేది అడిగామనుకోండి.ఆయా ఊర్లలో కొన్ని  వాడల్లోనే పాతిక ముప్పై మంది వెంకటేశ్వరరావులు, రామారావులు వుండే వారు.ఇక వాళ్ళ తండ్రుల పేర్లతో ఆనవాలు చెబుదామన్నా... వాళ్ళవీ అలాగే ఒకేలా వుండేవి.ఇక  ఫలానా వ్యక్తి ఆచూకీ తెలుసుకోవాలనుకున్న వారికి తల ప్రాణం తోకకు వచ్చేది.
ఇలాంటివి సరదా సంభాషణలు సినిమాల్లో కనిపిస్తూ కడుపుబ్బ నవ్విస్తుంటాయి.
కొత్త వ్యక్తి తారసపడి ఫలానా వ్యక్తి ఇల్లేది?కొంచెం వారి  ఇంటి చిరునామా చెబుతారా?అని అడిగితే జవాబు ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి.
ఇదిగో !ఇలా ఎడమ చేయి సాయగా వెళితే అక్కడో గాంధీ బొమ్మ వస్తుంది. ఆ బొమ్మ ముఖం ఎటు వైపు ఉందో అలా ముక్కు సూటిగా వెళితే రామాలయం కనిపిస్తుంది.ఆ ఆలయం పక్కనే ఓ కరెంట్ స్తంభం వుంటుంది. స్తంభానికి కుడి పక్క తిరిగితే ఓ పెద్ద గొయ్యి వుంటుంది.అది దాటి నాలుగు అడుగులు వేస్తే ఓ బడ్డీ కొట్టు వస్తుంది. ఆ కొట్టుకు ఎదురుగా నిలబడి చూస్తే మీకు కావలసిన ఇల్లు కనిపిస్తుంది. అడిగిన వ్యక్తిని తికమక పెట్టే విధంగా చెబుతుంటారు. తీరా అదంతా తిరిగితే భూమి గుండ్రంగా ఉందన్నట్టు తానున్న చోటికే వస్తాడా వ్యక్తి.
పట్నం తెలియని వారు వస్తే ఆటో వాళ్ళు ఎక్కువ డబ్బు గుంజడానికి  దగ్గరగా ఉన్న దాన్ని కూడా అంత దూరం, ఇంత దూరమని చెప్పి గిరాగిరా తిప్పుతుంటారు.
 ఇంతకూ దీనిని కూడా వదలకుండా మన పెద్దలు ఓ న్యాయంగా ఎందుకు చెప్పారో ఈ పాటికి అర్థమయ్యే వుంటుంది. 
ఇలా తలతిక్క జవాబులు, డొంకతిరుగుడు సమాధానాలు చెప్పేవారు మన చుట్టూ సమాజంలో చాలా మందే ఉంటారు.ఎదుటివారి అమాయకత్వాన్ని, తెలియని తనాన్ని ఆసరాగా చేసుకుని ఆట పట్టించడమే వీళ్ళ పని. కాబట్టి వాళ్ళ ముందు  అమాయకులుగా,ఏమీ తెలియని వారుగా వుండకుండా కొంచెమైనా విజ్ఞత ప్రదర్శించాలనే  హెచ్చరికతో ఈ "కాకాధికరణ న్యాయాన్ని" ఉదాహరణగా చెప్పారనేది స్పష్టంగా కనిపిస్తోంది.
 ఇదండీ! ఈ న్యాయం లోని ముఖ్య ఉద్దేశ్యం.ఇది గ్రహించి  ఎవరైనా మనల్ని చిరునామా అడిగితే  వారికి చక్కగా అర్థమయ్యేలా చెబుదాం. ఎవరికి ఎలాంటి అత్యవసరం వుందో తెలియదు కదా!అడిగిన వాళ్ళు  తేలికగా తెలుసుకునేలా చెబుదాం.అలాగే వారి అమూల్యమైన సమయాన్ని వృధా కానీయకుండా చూద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు