సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-435
కదంబ ముకుళ న్యాయము
*****
కదంబము అనగా గుంపు, కడిమి చెట్టు,తెల్లావాలు.ముకుళ అనగా మొగ్గ , అరవిరిసిన మొగ్గ,అభినయ హస్త విశేషము.
కదంబ ముకుళము అంటే కడిమి చెట్టు లేదా కదంబ వృక్షం పూల మొగ్గలు అరవిరిసి చూడటానికి అందంగా గుండ్రని బంతిలా కనిపిస్తాయని అర్థము.
 ఈ కదంబ వృక్షం మరియు  పుష్పము రెండూ చాలా పవిత్రమైనవి శ్రేష్టమైనవని మన పెద్దలు చెబుతుంటారు.మరి ఈ వృక్షం, పుష్పం యొక్క విశిష్టతలను తెలుసుకుందామా...
కదంబం అనగానే కదంబ పుష్పం కళ్ళముందు మెదులుతుంది.ఓ బంతిలా అందంగా చూడముచ్చటగా, బ్యాడ్మింటన్ బంతి ఆకారంలో కనిపిస్తూ మంచి సువాసనలు వెదజల్లుతుందని ఓ నిఘంటువులో మెరుపులు వచ్చినప్పుడు మొగ్గలు వికసించే చెట్టు అని కూడా చెప్పబడింది.
లేత ఆకుపచ్చ, పసుపు రంగు ఆకులతో అన్ని వైపులా బాదం చెట్టులా వ్యాపించి కొమ్మల గొడుగులా వుంటుంది.ఈ చెట్టు నీడలో  మనుషులూ,జంతువులూ హాయిగా సేద తీరవచ్చు.ఇది దాదాపు 150 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుందని వృక్ష శాస్త్రవేత్తలు చెప్పారు.
ఈ కదంబ వృక్షానికి పురాణాలలో కృష్ణ వృక్షం అనీ, పార్వతీ వృక్షమనీ అంటారు.
రాధా కృష్ణుల ప్రణయ గాధకు, ముచ్చట్లకు ఈ వృక్షం నీడే వేదిక అయ్యింది.బృందావనంలో కదంబ వృక్షాలు వుండేవట. కృష్ణుడికి ,ఈ చెట్టుకు గల అనుబంధం వల్ల కృష్ణ వృక్షం అని పేరు వచ్చిందని ఉత్తరాది వారంటారు.
ఇక దక్షిణాదిలో పార్వతి అమ్మ వారిని "కదంబ వనవాసిని" అంటారు. కదంబ వృక్షం సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపని నమ్మిక.లలితా సహస్ర నామాలలో కదంబ పుష్పం గురించి "కదంబ మంజరీ;కదంబ కుసుమ ప్రియ;కదంబ వనవాసిని... ఇలా ఎన్నో సార్లు వస్తుంది.
ఇవే కాకుండా హనుమంతుడి పుట్టుకకు కూడా కదంబ వృక్షంతో అనుబంధం వుందని అంటారు.

ఈ కదంబ పుష్పములు చాలా సుకుమారంగా ఉంటాయి ‌.వీటిని కోయకుండా రాలి పడిన పూలతోనే పూజ చేస్తారు.ఇవి తమ పరిమళాలతో ఎంతో దూరం నుండే మనసులను, మనుషులనూ ఆకర్షిస్తాయి.ముఖ్యంగా భక్తులు లలితా దేవి పూజలో  ఈ పవిత్రమైన పూలను  ఉపయోగిస్తారు.
ఈ కదంబ వృక్షం పేరిట రైతులు కదంబోత్సవాన్ని ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు జరుపుకోవడం విశేషం.ఆ రోజున కదంబ వృక్షపు కొమ్మను ఇంటికి తెచ్చుకుని పూజిస్తారు.ఆ రోజు సాయంత్రం ఆ చెట్టు పూల రెక్కల్ని బంధువులు, స్నేహితులతో పంచుకుంటారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ కదంబ వృక్షం మరియు పుష్పములకు  ఆరోగ్య రీత్యా అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు.
ఇలా భక్తికి ఆరోగ్య శక్తికి నిలయమైన  కదంబ వృక్షం , పుష్పం గురించి ఈ సందర్భంగా ఎన్నో విషయాలు విశేషాలూ ఈ "కదంబ ముకుళ న్యాయము" ద్వారా తెలుసుకోగలిగాం.
 కదంబ కుసుమం వలె సున్నితమైన హృదయంతో మానవీయ విలువల సువాసనలు వెదజల్లుతూ,కదంబ వృక్షములా పదిమందికి నీడవుతూ ,తోడవుతూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు