అంతర్జాతీయ మహిళా దినోత్సవం;-- వెంకట్ . మొలక ప్రతినిధి
 ప్రతి యేడులాగనే, ఈయేడు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున జరుపుకుంటున్నాము.  ఈ సంవత్సరం థీమ్ ఏమిటంటే "మహిళలలో పెట్టుబడి పెట్టండి: పురోగతిని వేగవంతం చేయండి" ఈ అంశం లింగ సమానత్వం వైపు ప్రగతిని వేగవంతం చేయడానికి మహిళల విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థికసాధికారిత మరియు నాయకత్వ అభివృద్ధి లో పెట్టుబడి పెట్టడం యొక్క కీలక పాత్రను నొక్కి చెబుతుంది.
 పారిశ్రామిక విప్లవానంతరం యూరప్, అమెరికా ఖండాలలో అనేకపరిశ్రమలునెలకొల్పబడ్డాయి.ఆ పరిశ్రమలలో పనిచేసే మహిళా కార్మికులు విపరీతమైన శ్రమ దోపిడీకి, అణిచివేతలకు గురయ్యే వారు. కనీస వసతులైన మరుగుదొడ్లు, తాగునీరు,గాలి, వెలుతురు, చంటిబిడ్డల సంరక్షణ లేకపోవడం, శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం, రోజుకు 15 నుండి 18 గంటలు పని చేయించడం, సెలవులు ఇవ్వకపోవడం మొదలైన సమస్యలు ఎదుర్కొనే వారు. ఈ సమస్యల పరిష్కారానికి ఆనాటి మహిళా కార్మికులు సంఘటితమై గడ్డకట్టే చలిలో కవాతులు,రాస్తారోకోలు, ధర్నాలు మొదలైన నిరసన కార్యక్రమాలు చేసేవారు. వారి పోరాటాలను కంపెనీ యజమానులు తీవ్రంగా అణచివేసేవారు. చివరికి సజీవ దహనాలు కూడా చేసేవారు. అయినా ఆ మహిళలు తమ పోరాటాల నుండి వెనక్కి తగ్గకపోవడంతో యూరప్, అమెరికా దేశాలలోని కార్మిక మేధావులకు, ఉద్యమకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన కమ్యూనిస్టు నాయకురాలు "క్లారా జెట్కిన్" 1910వ సంవత్సరంలో డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్ లో రెండవ అంతర్జాతీయ సోషలిస్టు మహాసభను ఏర్పాటు చేసి, ఆ సభలో ఆ మహిళా కార్మికుల అలుపెరుగని పోరాటాలను ఎత్తిపడుతూ, శ్రామికుల శ్రమ దోపిడీకి, అణిచివేతకు మూలకారణం పెట్టుబడిదారీ వ్యవస్థ అని, స్త్రీ పురుష కార్మికుల ఐక్య పోరాటాలే వారిని "శ్రమ విముక్తి" చేస్తాయని, అది కార్మిక వర్గం యొక్క "దీర్ఘకాలిక పోరాటాల" వల్లనే సాధ్యమవుతుందని చెప్పుతూ నొక్కివక్కానించారు. అంతేకాక కార్మిక వర్గమే పీడిత ప్రజలను సమూలంగా విముక్తి చేస్తుందని, ఈ పోరాటాలు సజీవంగా ఉండాలంటే నిరంతర చర్చ, నిర్మాణాలు, సంఘటిత పోరాటాలు ఉండాలని వీటి సమీక్షకు మహిళలకు ప్రత్యేకంగా సంవత్సరానికి ఒకరోజు ఉండాలని, అది ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల మహిళలు మహిళా దినంగా ఏర్పాటు చేసుకోవాలని క్లారా జెట్కిన్ ప్రపంచ మహిళలకు పిలుపునిచ్చారు.
 ప్రపంచంలో ఏ మూలన ప్రజా పోరాటాలు వెల్లువెత్తినా, వాటిని పీడిత ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని, తమ ముందున్న జీవన్మరణ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయడం చూస్తుంటాం. ఈ ప్రజాపోరాట సంస్కృతిని పెట్టుబడిదారులు అంతే వేగంగా నీరుగార్చి పోరాట "సారాన్ని" తుంగలో తొక్కి రూపాన్ని మిగిల్చి పాలకవర్గాల చేత తమ మార్కెట్ దోపిడిని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా దినం ఉద్దేశాన్ని కూడా తుంగలో తొక్కి, మహిళల్ని అత్యంత దుర్మార్గంగా దోపిడీ,అణిచివేతలకు గురి చేసిన ఇక్కడి ధనిక భూస్వామ్య బూర్జువా సంస్కృతిని మహిళా దినానికి జోడిస్తూ స్త్రీలను వంటలు, అల్లికలు, ముగ్గుల పోటీలకు పరిమితం చేశారు. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగులు, సంఘటిత కార్మికులు అనుభవిస్తున్న ఎనిమిది గంటల పనిదినం,ప్రసూతి,క్యాజువల్, చైల్డ్ కేర్ సెలవులు, పురుషులతో సమానమైన వేతనాలు, అలవెన్సులు మొదలైన హక్కులన్నీ ఆనాటి కార్మిక మహిళల పోరాట ఫలితమన్న చరిత్రను  బయటకు రానివ్వడం లేదు.
అంతేకాదు.,
"కార్మిక విముక్తి"అంటే ఆర్థిక రాజకీయ విముక్తే కాదు, సామాజిక, జెండర్, అంతర్ జెండర్, సాంస్కృతిక విముక్తి జరిగినప్పుడే క్లారా జెట్కిన్ ఆశయం,లక్ష్యం నెరవేరుతాయనీ ఆ రోజు రావాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా  కోరుకుందాం.
డాక్టర్ శారద వెంకటేశం ( ఆర్ సి ఓ ) సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల సొసైటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
కామెంట్‌లు