సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -427
ఉష్ట్ర శూల న్యాయము
******
ఉష్ట్ర అనగా ఒంటె,లొట్టె,లొట్టిపిట్ట,క్రమేలకము,మయము,మహంగము,వాసంతము అనే అర్థాలు ఉన్నాయి.శూల అనగా ఇనుప శలాక,(ఆయుధ విశేషము,) శివుని ఆయుధము తీవ్ర ఆవేదన.
"ఒంటెకు గల శూల నొప్పి  రోకళ్ళతో గానీ చక్కబడదు". అంటారు.
చక్కగాదు లొటిపిట శూల రోకండ్ల గాని" అనే సామెత కూడా ఉంది.
మరి శూల అంటే ఏమిటో ఎన్ని రకాల శూలలు వుంటాయో తెలుసుకుందాం.
 పొత్తికడుపులో వచ్చే ఆకస్మిక నొప్పిని శూల అంటారు. పొత్తి కడుపు నొప్పి 'శంఖ స్ఫోటన'అంటారు.అది దేవాలయాల్లో చేసే శంఖపు శబ్దాన్ని పోలి ఉంటుంది శూలతో బాధ పడుతున్న వ్యక్తి బాధ వర్ణనాతీతం. త్రిశూలం వంటి పదునైన ఆయుధంతో గుచ్చబడినంత బాధ పడతాడు.
ఈ శూలు వాత పిత్త కఫ లాంటి యిబ్ఫందులతో ఎనిమిది రకాలుగా వుంటుందని ఆయుర్వేద వైద్యులు కనుగొన్నారు. ఒక్కో రకమైన శూలకు ఒక్కో రకమైన బాధ , లక్షణాలు వుంటాయని, వాటికి సంబంధించిన వైద్యము, నివారణోపాయాల గురించి చెప్పారు.
 మరి ఇలాంటి శూల నొప్పులు ఒంటెలకు కూడా వస్తాయట. వాటికి మనలాగా మందులూ ,మాకులూ మింగడాలు వుండవు.కాబట్టి మొరటు వైద్యం చేస్తుంటారన్న మాట.అందుకే ఒంటెల శూలకు రోకటి పోట్లు.రోకళ్ళతో  పోటు పొడిస్తే తగ్గుతుందని మూఢ నమ్మకంతో వాటి నొప్పిని గమనించి అలా చేస్తుంటారని ఈ న్యాయము ద్వారా మనం అర్థం చేసుకోగలిగాం కాని "అది రోగం ఒకటైతే మందొకటి ఇచ్చినట్లు" లాంటిది కదా!
 ఇది 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ'లాంటిది కూడా. కుక్క కాటు వేస్తే వెంటనే దానికి సంబంధించిన ప్రథమ చికిత్స చేయాలి.అంతే కానీ చెప్పు దెబ్బ  కొట్టడం వల్ల ఉపయోగం లేదు కదా!'.
అయితే  మన పెద్దవాళ్ళు మడమ శూల, కండరాల శూల లాంటివి వచ్చినప్పుడు. దాని బాధ తగ్గడానికి ఆ ప్రాంతంలో మర్దనా పేరుతో వివిధ రకాల నూనెలు రాసి ,రక్త ప్రసరణ జరిగేలా వేళ్ళతో తడుతూ ,కొడుతూ వుంటారు. అలా  కొట్టడం వల్ల కొంత సేపు ఉపశమనం కలుగుతుంది‌.పూర్తి నివారణకు పరిష్కారం అదైతే కాదు.తప్పకుండా వైద్యులను సంప్రదించి తగిన ఔషధం వాడితేనే మళ్ళీ రాకుండా  జాగ్రత్త పడవచ్చు. 
అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే మన పెద్దలు ఈ న్యాయమును సృష్టించి వుంటారని అర్థమవుతోంది.
మరి ఇలాంటి శూలలు రాకుండా యోగాలో ఉష్ట్రానికి సంబంధించిన ఉష్ట్రాసనమే వుంది. దానిని యోగా గురువుల ద్వారా నేర్చుకోవాలి.
ఈ ఉష్ట్రాసనం వేయడం వలన మడమలు, తొడలు, శరీరం,ఛాతీ, గొంతు,కటి ,పొత్తి కడుపులను దృఢంగా  వుంటాయి.ఉబ్బసం యొక్క దుష్ప్రభావాలను తొలగించి, శ్వాస కోశాలను, ఊపిరి తిత్తుల పనితీరును, ముక్కు నాళికను,నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.మూత్ర పిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
 ఈ "ఉష్ట్ర శూల న్యాయము" పుణ్యమా అని శూలలోని రకాలు, చికిత్స  మొదలైన విషయాలనూ,యోగాలోని ఉష్ట్రాసనం  యొక్క ఉపయోగాలను  తెలుసుకోగలిగాం.
ఎవరైనా తెలిసీ తెలీక  శూల నొప్పి వచ్చినప్పుడు మొరటు వైద్యం చేయించుకునే వారికి అర్థమయ్యేలా చెబుదాం. మరింత అనారోగ్యం పాలు కాకుండా మంచి సలహాలు సూచనలు ఇద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు