సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -437
కదళీ కాక న్యాయము
******
కదళీ అనగా అరటి చెట్టు,ఒక రకమైన దినుసు.కాక అనగా  కాకి, వాయసము అనే అర్థాలు ఉన్నాయి.
 కదళీ కాక న్యాయములో  రెండు న్యాయాలు ఉన్నాయి. అరటి చెట్టు మరియు కాకికి సంబంధించిన న్యాయములు.
అవేమిటో చూద్దామా...
కదళీ అనగా అరటి చెట్టు కదా.అరటి చెట్టు  న్యాయము ఏమిటో తెలుసుకునే ముందు అరటి చెట్టు ప్రాముఖ్యతను, విశేషాలను తెలుసుకుందాం.
అరటి ఒక చెట్టులా కనిపిస్తుంది కానీ అదొక మొక్క. ఇది కొమ్మలు లేని చెట్టు.కాండము చాలా చాలా పెద్ద ఆకులను కలిగి ఉంటుంది. అరటి గెల వేస్తుంది. గెల అంటే అరటి కాయల గుంపు. గెలలోని ఒక్కొక్క గుత్తిని అత్తము లేదా హస్తము అంటారు.
 విశేషం ఏమిటంటే ఈ అరటి చెట్టు గురించి క్రీస్తు పూర్వం కూడా ఉంది. బౌద్ధ సాహిత్యంలో ఈ అరటి ప్రస్తావన ఉంది. అరటిని శుభానికి సూచికగా భావిస్తారు.ఏ శుభకార్యమైనా అరటి పండ్లు లేకుండా జరుగదు.
 ఇతిహాసాలలో కూడా కదళీ ఫలం గురించి ప్రస్తావన ఉంది.దీనికి సంబంధించిన కథను కూడా చూద్దాం.
మహర్షులలో అతి కోపిష్టి దుర్వాస మహర్షి. ఎప్పుడూ కోపంతో వుండే వ్యక్తిని "అబ్బో ఇతడో దుర్వాస మహర్షి.ముక్కుమీదే కోపం". అనడం  మన ఇళ్ళల్లో తరచూ చూస్తుంటాం.
మరలాంటి దుర్వాస మహర్షి భార్య పేరు కదళి.అతనికి కోపం రాకుండా అతి జాగ్రత్తగా మసలుకునేదట.ఓ రోజు సాయం సంధ్యా కాలంలో ఎంతో అలసటగా వుండి పర్ణశాల అరుగు మీద పడుకొని అలాగే గాఢనిద్రలోకి వెళ్ళాడట.సాయంకాలం సంధ్యావందనం చేయవలసిన సమయం.ఇటు దుర్వాస మహర్షేమో లేవడం లేదు.లేకపోతే కోపగిస్తాడు.సమయం దాటి పోతోందనే భయంతో అతణ్ణి నిద్ర లేపుతుంది.తనకు నిద్రాభంగం కలిగించినందుకు కోపగించుకుని తీవ్రమైన ఆగ్రహంతో కళ్ళు తెరిచి భార్య కదళిని చూస్తాడు.అతడి క్రోధాగ్ని జ్వాలలకు కదళి భస్మమైపోతుంది.కోపం వల్ల జరిగిన అనర్థానికి దుర్వాసుడు పశ్చాత్తాప పడతాడు.కానీ చనిపోయిన భార్య తిరిగి రాదు కదా!
కొన్ని రోజుల తర్వాత కదళి తండ్రి దుర్వాసుని మామగారు ఆశ్రమానికి వచ్చినప్పుడు కూతురు విషయం తెలిసి కుమిలి పోతాడు.అప్పుడు దుర్వాసుడు తాను చేసిన తప్పుకు క్షమించమని వేడుకుని,తన తపోశక్తితో ఆ భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడట. ఆ చెట్టే కదళీ వృక్షం అంటారు.
ఈ కదళీ వృక్షం భూలోకంలో అందరికీ ఇష్టురాలవుతుందనీ అన్ని శుభకార్యాల్లో ముందుండి గౌరవం పొందుతుందని చెప్పాడట. ఆ విధంగా కదళి అటు భగవంతునికి భక్తులకు మధ్య పూజలు, వ్రతాలు,నోములలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఆరోగ్య పరంగా కూడా  కదళీ ఫలం ఎంతో ఉపయోగకరమైనది.ఈ చెట్టు ఆకుల్లో భోజనం చేయడం మంచిదనేది అందరికీ తెలిసిందే.
అయితే అరటి చెట్టు ఒకే ఒక్క గెల వేస్తుంది.ఆ  తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. "ఒక్క బిడ్డ బిడ్డ కాదు.ఒక్క కన్ను కన్ను కాదు" అనేవారు  పూర్వ కాలంలో. ఆ కాలంలో ఎంత మంది బిడ్డలు వుంటే ఆ తల్లికి అంత గొప్ప గౌరవం లభించేది.అందుకే అరటి చెట్టు ఒక్కటే గెల వేస్తుంది కాబట్టి "కదళీ వంధ్య" అనే వారు. వంధ్య అంటే 'గొడ్రాలు' అని అర్థము.
ఇక" కాక వంధ్య"ను చూద్దాం.
కాకి తడవకి రెండు నుంచి ఏడు గుడ్లు పెడుతుంది. కానీ ఒకటి రెండు పిల్లలను మాత్రమే పొందుతుంది. ఇద్దరు పిల్లలు కూడా తక్కువ సంతానం కిందే లెక్క కాబట్టి కాకిని కూడా "కాక వంధ్య" అంటారు మన పూర్వీకులు.
అయితే కాక వంధ్యకు సంబంధించిన మరో కథ కూడా ఉంది.
కాకులు గుడ్లు పెడుతూనే వుంటాయి. కానీ కోకిల వచ్చి కాకి గుడ్లను తోసి వేసి తాను ఆ గూటిలో గుడ్లు పెడుతుంది.ఇలా కాకి పెట్టిన గుడ్లు కాకికి దక్కవు.పిల్లలు కాకముందే అవి కిందపడి పగిలిపోతాయి.
 అదే విధంగా గర్భం ధరించిన స్త్రీకి పుట్టిన పిల్లలు దక్కకుండా పోయినప్పుడు ఆ స్త్రీని "కాక వంధ్య" అని అంటారు.
 ఇలా పిల్లలు పుట్టి పోయిన స్త్రీలను, ఒకరిద్దరే బిడ్డలున్న స్త్రీలను పూర్వ కాలంలో 'కదళీ వంధ్య', 'కాక వంధ్య' అనేవారు.
 ఇదండీ! "కదళీ కాక న్యాయము"అంటే.
 ఒకప్పుడు పిల్లలే సంపదగా భావించేవారు.కానీ రాన్రానూ జనాభా అధికంగా పెరగడం పిల్లల పెంపకం కష్టం కావడం.వారి కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితులు రావడంతో జనాభా పెరుగుదలను అరికట్టుటకు "కుటుంబ నియంత్రణ" ప్రవేశపెట్టారు.ప్రస్తుత కాలంలో ప్రజల్లో అవగాహన బాగా రావడంతో ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను ఎవరూ కనడం లేదు.
అయినా మనం అనుకుందాం అరటి చెట్టు ఒక్క గెలతోనే బోలెడు పండ్ల బిడ్డలను కంటుంది కదా!అలాగే త్యాగమూర్తైన కాకి ఎలాగోలా తన బిడ్డలను రక్షించుకుంటూనే కోకిల బిడ్డలను కూడా సాకుతుంది.కాబట్టి మనం  వాటిని 'కదళీ వంధ్య', 'కాక వంధ్య' అనకుంటేనే మంచిదేమో.అయినా ఇది అప్పటి కాలంనాటి విషయం కదా! 
 ఏది ఏమైనా ఈ న్యాయము ద్వారా మనకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయని ఆనందపడదాం. మరి మీరేమంటారు?
 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు