సుప్రభాత కవిత ; - బృంద
చుట్టుముట్టి కన్నుగప్పినా
ఆపగలరా అరుణోదయం
పట్టుదప్పని ప్రకాశం జడిగా
ప్రసరించక మానేనా భువిపై??

గ్రహణాలు మార్చగలవా
గ్రహరాజుని గమనాన్ని
ఆగ్రహమెరుగని ఆప్తుని
అనుగ్రహం అందకపోయేనా?

కష్టించి పనిచేసే మనిషిని
ఇష్టంగా అభిమానించి
ఇడుములు కలిగినా బెదరనీక
అడుగులు వేయించడా తండ్రి?

కారణమే లేని రణములు
ఎన్ని వచ్చినా ఎదురొడ్డే
సుగుణముల ప్రసాదించి
విజయము వరింపచేయడా మిత్రుడు?

అంధకారము అలమిన
అవనీతలమంతా అవలీలగా
ఆక్రమించి ,అపరంజి కాంతులు
నింపడా ఆదిత్యుడు?

అలుపెరగక పయనించే
కాలచక్రపు గమనంలో
తప్పులన్నీ తెలియచేసి
ఒప్పు దారిని నడిపించే

కొత్త వెలుగుల వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు