అరణ్యవాసం!!;- డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా
ఒకచోట వజ్రం తయారవుతుంది
ఎక్కడో ఒకచోట బంగారం దొరుకుతుంది.
రెండింటి నీ దగ్గరికి చేర్చే సన్నివేశమే
ప్రయత్నం-అదే గొప్ప ప్రణయం!!

కండరాలు కరుగుతుంటే
రాళ్ళకు చెమటలు పడుతున్నాయి!

గోపురం ఎదిగిందని దీపం ఆరిపోలేదు
కేతనం విజయానికే కాదు గాలి సుగందానికి రెపరెపలాడుతుంది.!!

పునాదులు పుడతాయి నదుల్లా
నదులు పునాదులకు సమాధులు ఉండవు.
ప్రశ్నలు వెంటపడతాయి
సమాధానాల సౌందర్యం కోసం!!!

కాలుతున్న నేల తొలకరి కోసం
తలుపులు తెరిచినట్లు ప్రేమ కోసం విత్తు భూమిని చీల్చింది.!!

ఒదిగిన మది ఎదను గదిగా చేసుకుంది
చిలిపి పిలుపు కోసం చిరునవ్వైమొలిచిందీ

చిత్రలేఖనం ముఖం అయితే చిత్రపటం గాలిపటంలా తేలుతుంది.
నవ్వుతున్న చిలకల ఇంట
పంజరాలు రాలిపోతున్నాయి.!!

ఎగురుతున్న గువ్వలు సిరిమువ్వల్లా మోగుతున్నాయి.
సిరిసంపదలు వెదురు మొలకలు పొదల్లో
సెలయేటి గట్టుపై
పచ్చని గడ్డి పోచలు పసిడి తీగలు కావా.!!?

కణ కణ మండే నిప్పు తునకల్లో
ఉక్కు కూడా ఉప్పుల మండుతుంది!!!
చెక్కుచెదరని శిల్పం రంగును కోల్పోదు
ప్రేమ నిండిన గుండె జంటను వీడదూ!!!

నీళ్లకు రంగులద్ది విద్యుత్ దీపాలతో
బృందావనాన్ని సృష్టిస్తే
నెమలి పురివిప్పి నాట్యం ఆడదు.
పావురాన్ని ఎరుపు రంగులో చూడలేం!!!

స్నేహం మోహం శాశ్వతం కాదేమో
పర్వం సర్వస్వం విరాటపర్వం కాకూడదు.
పరీక్షలతో కాలమే కాలిపోతుంది.!!!

జగమంతా
దేదీప్యమానంగా వెలిగిపోతున్నది పడుతుల వల్ల!!!
ఇక అరణ్యవాసం అవసరం లేదు.!!!?

తెలంగాణ మాండలిక ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్యకు అంకితం.

డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా 🙏
కామెంట్‌లు