జవహర్ బాల భవన్....ఒక జ్ఞాపకం...-1-; ప్రమోద్ ఆవంచ- 701327245

 ఆ ఇల్లు ప్రస్తుతం శూన్యగృహం.అక్కడ ఒక కుటుంబం ఎనబైవ దశకంలో నివాసముండేది.ఆ కుటుంబం రోజూ కేవలం రెండు మూడు గంటలే కలిసి ఉండేది.ఆ సమయంలోనే ఆ ప్రాంగణం అంతా కళ కళలాడుతూ ఉండేది.విధ్యార్దులలో ప్రతిభను  వెలికితీసి, వారికి ఇష్టమున్న సంగీతం,చిత్రలేఖనం,వాయిద్య, నృత్య,కుట్టు, అల్లికలలో నిష్ణాతులు చేయడానికి తల్లి తండ్రుల సమానులైన గురువులు మా పిల్లల కోసం ఏ లాభాపేక్ష లేకుండా పనిచేసేవారు.చాలా ఏళ్ళ  తర్వాత నేను ఒక మూడేళ్ళు తిరుగాడిన మా ఇంటికి ఉన్న పెద్ద గేటులో నుంచి లోపలికి వెళ్ళాను.ఇల్లు పాతబడింది.ఆ ఇంటికి మేము పెట్టుకున్న పేరు పిల్లలకు ఇష్టమైన జవహర్ లాల్ నెహ్రూ పేరు...అదే జవహర్ బాల భవన్.మా ఇంటిపైన  అందరికీ తెలిసేలా అప్పట్లో ఒక పెద్ద బోర్డు కూడా పెట్టుకున్నాం.ప్రస్తుతం అది పైనుంచి కిందికి డిప్రమోట్ అయ్యింది.రంగు కోల్పోయి, బోర్డుకు ఉపయేగించిన ఇనుప రేకుచిలుం   పట్టింది,దానికి ఆనుకుని 
ఉన్న కర్రలకు చెదలు పట్టింది.గుండె కలుక్కుమంది.మనసుకు పట్టిన జ్ఞాపకాల పొరలు ఒక్కొక్కటిగా విచ్చుకున్నాయి.కాలం ఎంత దయ లేనిది గత వైభవాన్ని తలుచుకొని కళ్ళు వర్షించేలా చేసింది.ఆ బోర్డు పక్కనే అప్పటి మంత్రి  రోడామిస్టీ ,అప్పటి కలెక్టర్ శ్రీమతి శారదా ఆర్  గ్రోవర్ గారు 1970  లో వేసిన శిలా ఫలకం  దుమ్ము ధూళి మేఘంలా కమ్మి మసక మసకగా కనిపించింది.నా వెంట నా డీవిఎం స్కూలు మిత్రుడు కరుణాకర్ కూడా ఉన్నాడు.మేయిన్ గేటుకి ఎదురుగా రెండు ఫర్లాంగుల దూరంలో మా ఇంటి పిల్లలం ఆడుకునేందుకు ఉయ్యాలలు,జారుడుబండ, ఉండేవి... నేను ఆడుకున్న జ్ఞాపకం ఇంకా కళ్ళల్లో మెదులుతూనే ఉంది.అవి కనిపించలేదు ప్రస్తుతం అక్కడంతా ఏదో భవన నిర్మాణం చేపట్టారు .  .అక్కడున్న వాళ్ళను అడిగా ఏం కడుతున్నారని, మాకు తెలియడండీ ఎవరో ప్రముఖ అడ్వకేట్ కట్టిస్తున్నారు.వివరాలు తెలవదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.అధ్వాన్న స్థితిలో ఉన్న మా ఇంటిని చూసి మృణాల్ సేన్, సత్యజిత్ రాయ్, నర్సింగ్ రావులు తీసినఆర్ట్ ఫిల్మ్ లు మనసులో మెదిలాయి.ప్రపంచం తన చలనాన్ని 
ఒక్కసారిగా ఆపేసి, మెల్ల మెల్లగా పెరిస్టాలిటిక్ మూవ్మెంట్ లో సాగుతున్నట్లు అనిపించింది.మా ఇంటి లోపలికి అడుగు పెట్టాను,అదే మా బాలభవన్ లోకి.హలు నిండా వర్షం తాలూకు నీళ్ళు గోడల్లో ఇణికి రకరకాల మ్యాపులతో గోడల రంగును మార్చేసాయి.
రంగు ఎలాంటిదంటే ముదురు గోధుమ రంగు.ఆ గోడకు ఒక జలపాతాలకు సంబంధించిన ఒక పేయింటింగ్.ఆ పేయింటింగ్ బ్యాక్ గ్రౌండ్ గోడంతా వర్షంతో తడిచినట్లుంది
హాలులో వరుసగా కొన్ని పేయింటిగ్స్ ఉన్నాయి. శృంగారం, రౌద్రం, భయానకం, బీభత్సం,వీరం లాంటి నవ రసాలను అద్భుతంగా చిత్రీకరించిన బొమ్మలు ఒక వరుసలో పొందు పరిచి గోడకు అతికించారు.ఆ బొమ్మలను దాసి సుదర్శన్ గారు గీసారని అనుకుంటా.ఎందుకంటే అప్పట్లో నేను కూడా ఆయన దగ్గర చిత్ర లేఖనం నేర్చుకున్నాను.ఆయన ఇటీవలే మరణించడం బాధాకరం.ఆయనను కలిసి బాల భవన్ తో ఆయన అనుబందం గురించి తెలుసుకుందాం అనుకున్నా ఈ విషయాన్ని మిర్యాలగూడ బక్కల్ వాడి స్కూలు టీచర్ ఉమా శంకర్ గారితో కూడా చర్చించా,ఆయన పాజిటివ్ గా స్పందించి మనం వెళ్ళి కలుద్దాం అన్నారు.కానీ దురదృష్టవశాత్తూ ఈ లోపలే ఆయన మనకు కలవనంత దూరం వెళ్ళిపోయారు.ఆ బొమ్మల కింద ఒక నల్లని బోర్డు.ఈ బోర్డు ఇప్పుడైతే ఉంది కానీ అప్పట్లో ఉందో లేదో జ్ఞాపకం రావడం లేదు.హాలులో రెండు ఫోటోలను చూసి నాకు మహదానందం వేసింది.ఒకటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మరొకటి ఈ మా ఇంటికి పెద్ద దిక్కుమా కుటుంబ సభ్యుల గురించి అహర్నిశలూ ఆలోచిస్తూ
కొత్తగా ఏం చేయాలో పిల్లల ఆసక్తికి అనుగుణంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ ను గుర్తిస్తూ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేకున్నా, సమయానికి రాకున్నాసంబంధిత మాస్టార్లతో సమన్వయం చేసుకుంటూ ఎంతో మంది పిల్లలకు( విధ్యార్థులు) జీవనోపాధి కల్పించడంతో పాటు, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఆనేక మంది విధ్యార్థులు పేరు ప్రఖ్యాతులు గడించే విధంగా చేసిన 
బాల భవన్ వైస్ చైర్మన్ శ్రీ రామచంద్ర మూర్తి గారిది. బాల భవన్ కి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ వ్యవహరించేవారు.
ఈ రెండు ఫోటోలు చూడగానే నాకు చాలా సంతోషం వేసింది.శ్రీరామచంద్రమూర్తి గారు అప్పట్లో నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసేవారు.ఆ ఫోటోలు టచ్ చేస్తే కింద పడేలా ఉన్నాయి. ఇంకా బాధాకర విషయం ఏమిటంటే  హాలు, మిగితా  గదులలో  కిటికీ అద్దాలు పగిపోయి, అందంగా, ఆకర్షణీయంగా కనబడే మా ఇల్లు వెల వెల పోయినట్లుఅనిపించింది.ఒక రూములో జవహర్లాల్ నెహ్రూ నిలువెత్తు పేయింటింగ్...పాపం మా చాచా శరీరం అంతా తీన్ ఇంచ్ మందం దుమ్ము.రెండు రూముల్లో రెండు పురాతన బీరువాలు, హాలులో చెక్కతో తయారు చేసినఒక రాక్... దాంట్లో ఏవో పేపర్లు వాటిని టచ్ చేస్తే అందులో నుంచి వచ్చిన దుమ్ము నా నాసికా రంద్రాలు మూసుకునేలా చేసి అప్రయత్నంగా తుమ్ము వచ్చేసింది.చూడాలనుకున్న ప్రయత్నాన్ని విరమించుకొని,బాధతో
ఒకసారి చుట్టూ ఆ ప్రదేశమంతా తిరిగాను.ఏదో అసంతృప్తి..జీర్ణించుకోలేని మా ఇంటి పరిస్థితి.నల్గొండ నడి బొడ్డులో మా ఇల్లు బాల భవన్,ఒకవైపు జిల్లా కోర్టు,దాని పక్కనే కలెక్టర్ గారి ఇల్లు, వెనుకవైపు జిల్లా పరిషత్భవనం,దాని పక్కనే మున్సిపల్ ఆఫీసు... ఇవన్నీ పొద్దుటి నుంచి వచ్చి పోయే జనాలతో కళకళలాడుతూఉంటే ఒక్క బాల భవన్ మాత్రం శూన్య గృహంలామిగిలిపోయింది.ఊర్లల్లో వదిలేసిన ఇల్లులా కనిపిస్తుంది.పిల్లలు,వైస్ చైర్మన్ శ్రీ రామ చంద్ర మూర్తి మిగితా గురువులు,ఆయా బీజాన్ బీ, వాచ్మెన్ నర్సయ్య లతో సహా ఒక కుటుంబంలా కలిసి ఉన్న మా ఇల్లు ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది....నలబై ఏళ్ల జీవితం కాలం కాళ్ళ కింద నలిగిపోయింది.అది చెప్పినట్లు వింటూ... ఒకసారి నిట్టనిలువునా పీకల దాకా నీళ్ళల్లోకి దింపుతుంది.మరికొన్నిసార్లు అన్నీ మన దగ్గరికే వచ్చేలా చేస్తుంది.అనేక సార్లు ఏడిపిస్తుంది, కొన్నిసార్లు నవ్విస్తుంది, ఆశ్చర్యంగా కొన్ని సార్లు మన చేయి పట్టుకొని గమ్యం వైపుకు నడిపిస్తుంది.మన సమస్యలకుపరిష్కారం తట్టకుండా చేస్తూ కొన్ని సార్లు వేడుక చూస్తుంటుంది.ఎటూ అర్థం కాని సమయాల్లో అకస్మాత్తుగా ఏవో అద్భుతాలుజరుగుతాయి.అంతా మంచి జరుగుతుందనుకున్న సమయంలో మనల్ని బజారుకీడ్ఛి బేజారు చేస్తుంది....ఇలా నలభై ఏళ్ళలోజీవిత సంగ్రామంలో ఎన్నో ఆటుపోటులు, ఎన్నో నష్టాలు,మరెన్నో దుఃఖాలు, కొన్ని సంతోషాలు, ఎన్నో పాఠాలు...వీటన్నిటి స్వీకరిస్తూ సాగుతున్న ఈ నా ప్రయాణంలోఅప్పుడప్పుడు నా బాల్య స్మృతులు నాకు తోడైతే, వాటిలోకి ప్రయాణం చేస్తూ ఆ జ్ఞాపకాలను మీతో పంచుకుంటా,మీతో స్నేహాన్ని పెంచుకుంటా.. ఎనబైవ దశకంలో మా ఇల్లు వైభవాన్ని నా కళ్ళతో చూస్తే... బాధగా వుంది ,,

కామెంట్‌లు