శ్రీరామరక్ష - సర్వజగద్రక్ష!;- కవి మిత్ర, శంకర ప్రియ.,-సంచార వాణి:- 99127 67098
⚜️భువి ధర్మమూర్తి యైన
శ్రీరాముడే రక్షకుడు
     సమస్త మానవాళికి!
శరణు శ్రీరామ రక్ష! 
⚜️స్థావర జంగమమగు
జగతికి రక్షకుడు
      కోదండ పాణి, రామయ్య!
శరణు శ్రీరామ రక్ష!
   [ అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,]

🌻శ్రీరాముడు.. మర్యాద పురుషోత్తముడు! మూర్తీభవించిన ధర్మము కలవాడు!అందరికీ ఆత్మ బంధువు! అభిమాన దైవము.. శ్రీరామచంద్ర పరబ్రహ్మము!

🪷లోకంలో మహాత్ములందరు.. ధర్మాత్ములే! వారు.. అనుదినం ధర్మ మార్గమును అనుసరిస్తారు!  యధార్థమైన వాక్కులను మాట్లాడుతారు! సమస్త ప్రాణికోటికి మంచిని కోరుకుంటారు! అహింస, సత్యము, ధర్మము, శాంతి.. మున్నగు సద్గుణములతో ప్రకాశించుతారు! 
⚜️అందరినీ ప్రేమించి, నిష్కళంకమైన ప్రేమను పంచిపెడతారు! అటువంటి మహానుభావులను,, ఈ చరాచర ప్రపంచమును.. కంటికి రెప్పలా  కాపాడుచున్నాడు... సర్వ జగద్రక్షకుడైన శ్రీరామ భద్రుడు! 
       శుభం భూయాత్!

          🚩సీస పద్యము
ధర్మ మార్గమ్మునే తలచుచు మెలగిన
       ప్రజలకు అదియె "శ్రీరామరక్ష"
సత్య వాక్యమ్మునే సర్వదా పలికిన
       ప్రజలకు అదియె "శ్రీరామరక్ష"
సర్వభూత హితమ్మె సతతమ్ము కోరిన
      ప్రజలకు అదియె "శ్రీరామరక్ష"
సుగుణాలతో గూడి శోభిల్లు చుండిన
      ప్రజలకు అదియె "శ్రీరామరక్ష"
        🚩తేట గీతి పద్యం
 ప్రేమతోనున్న అదియె "శ్రీరామరక్ష"
      అటుల "సర్వ జగద్రక్ష"యగు నటంచు
ఆచరించిన జయముల నందగలము!
      భద్రముల నిత్య శుభముల బడయ గలము!

     [ రచన:- కోట రాజశేఖర్., అష్టావధాని.,]

🕉️ శ్రీరామ! జయ శ్రీరామ! జయజయ శ్రీరామ!;

కామెంట్‌లు