సునంద భాషితం ; వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -467✍️
కోష్ఠ పాన న్యాయము
   *****
కోష్ఠము అనగా సామగ్రులుంచెడు కొట్టు.గాదె,లోకడుపు.పానం తాగుట, మద్యపానం,కాపాడుట అనే అర్థాలు ఉన్నాయి.
ఇంటికి తెప్పించుకుని సామగ్రి ఉంచే గదిలో రహస్యంగా కల్లు తాగినట్లు.
కొందరు రహస్యముగా దుష్కార్యములను చేయుదురు అనే భావముతో ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 "దొరికితే దొంగ దొరకనంత వరకు దొర" , చెప్పేవేమో  శ్రీరంగ నీతులు చేసేవేమో నీచపు పనులు" అనే సామెతలు దీనికి సరిగ్గా సరిపోతాయి.
దొరకనంత వరకు దొరబాబుల్లా పెత్తనాలు చేస్తూ , అమాయకులను మోసం చేసి తమ అవసరాలు తీర్చుకుంటూ పబ్బం గడుపుకుంటారు.
 ఇక దొరికిన తర్వాత దొంగ కాదన్నట్లు, బతిమిలాడుతూ  కాళ్ళ బేరానికి రావడమో చేస్తుంటాడు.
 శ్రీరంగ నీతులు అంటే వారు శ్రీ రంగ స్వామి అయిన శ్రీ మహావిష్ణువు గురించి చెప్పే నీతులు. మంచివే కానీ  చేసేవి మాత్రం నీచపు  పనులు. వాళ్ళు  చెప్పేది సాక్షాత్తూ దైవం గురించిన మంచి మాటలు. మరి చేసేవి మాత్రం అసహ్యకరమైన పనులు.
ఇలా వ్యక్తుల గురించి తెలియనంత వరకు వాళ్ళు చెప్పేవి భక్తి శ్రద్ధలతో వింటాం. వాళ్ళ అక్రమ సంబంధాలు, అనుచిత పనులు చూసిన తర్వాత అలాంటి వారంటే అందరికీ ఓ రకమైన ఏహ్యభావం కలుగుతుంది.
 కొందరు బయటికి మాత్రం పరమ నిష్ఠాగరిష్టులుగా కనిపిస్తుంటారు. వాళ్ళను బాగా వెన్నంటి ఉండి గమనిస్తే తెలుస్తుంది.సకల గుణాభిరాములని.ఈ పదం చదివి మంచి వాళ్ళే కదా! అనుకోకండి.ఆక్షేపణీయమైన దానికి ఉదాహరణగా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు.
ఇలా చాటు మాటు వ్యవహారాలంటే వినడానికే కాదు, చదవడానికి కూడా అసహ్యంగా ఉంటుంది.
 పైకి ఏమీ తెలియని అమాయకత్వంతో కనిపిస్తుంటారు.
 మేడిపండు చందంలా కనిపిస్తుంటారు. పొట్ట విప్పి చూస్తే పురుగులు వున్నట్టు మనుషుల లోలోపల అన్నీ లుకలుకల కుళ్ళు బుద్ధులే.
ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
'చెప్పేదొకటీ - చేసేది మరొకటి. మాటకూ  చేతకూ అస్సలు పొంతనే వుండదు.
 మనం టీవీ చానెళ్లలో వార్తా పత్రికలో చూస్తూ ఉంటాం. ఫలానా వ్యక్తి ఇలా దొరికిపోయాడు,అలా దొరికి పోయాడు అని.
అప్పటి  వరకూ పెత్తనాలు చేస్తూ తామే ధర్మాన్ని కాపాడుతున్నట్లు, తాము లేకపోతే ధర్మాన్ని ఎవరు కాపాడే వారే లేదన్నట్లు గొప్పలు పోతారు. అసలు నిజాలు తెలిసినప్పుడు ఆశ్చర్యపోవడం విన్నవారి, చదివిన వారి వంతు అవుతుంది. ఈ మధ్య అలాంటి పెద్ద వాళ్ళ సంఘటనే అందరి దృష్టికి వచ్చిన విషయం తెలిసిందే.
 ఇలా పైకి ఓ విధంగా లోపల మరో విధంగా ఉండే వ్యక్తులు మన చుట్టూ ఉన్న సమాజంలో చాలా మందే ఉన్నారని చెప్పడానికి మన పెద్దవాళ్ళు ఈ "కోష్ఠ పాన న్యాయము" ను ఉదాహరణగా చెబుతుంటారు.
 తస్మాత్ జాగ్రత్త అండీ! అసలే రోజులు బాగా లేవు.ఎవరు ఎలాంటి వారో డేగ కన్నుతో నిఘా వేసి చూస్తూ అప్రమత్తంగా ఉందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు