పరిణయం!!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
వేలికి ఉంగరం తొడుగుతున్న వేళ
మెడలో తాళి కడుతున్న వేళ
మాల మార్చుకుంటున్న వేళ
ఒక పొగడపువ్వు నవ్వింది
ఒక కోకిల కూసింది
నెత్తి మీద సూర్యుడు అక్షింతల మెరిసిండు
కోవెల ఇంట మేళ తాళాలు మోగాయి!!!

ఆలయాలు అన్నీ అలంకరించుకున్నాయి
ఇద్దరి నుదుట తిలకం దిద్ది పొద్దు మూకింది
నెలవంక తొంగి చూసింది
రాత్రి అవక ముందే నక్షత్రాలన్నీౠ రాలిపోయాయి.
కోనేటిలో కొత్త రూపం దిద్దుకుంది.!!

పిలవకుండానే కాలం వచ్చింది
మేఘాలు వెలిగిపోతున్నవి
పైరగాలి ఒకసారి ఇలా వచ్చి వెళ్ళింది
పచ్చని సిరి ముచ్చటపడి చాటుకు వెళ్ళింది.

చెరువు ఏదో వేదం చదివింది
కాలువ ఏదో కావ్య దానం చేసింది
పగలేము పండగ చేసుకుంది
చీకటేమో కాచు కూచుంది.

దూరంగా దీపంలా కట్టే కాలుతుంది
దివిటీలా మార్గం వెలుగుతుంది
పాదాలన్నీ పట్టుచీర పై కదులుతున్నవి
పంది రేమో మందితో నిండిపోయింది.
గంధమంతా గదులన్నీ నింపింది.!!!

ముచ్చట్లు చప్పట్లు రెక్కలు వచ్చి ఎగురుతున్నవి.
ముదిమేల మది అందమై కిందికి దిగింది
కుందేలు లేళ్లు నెమళ్లు నృత్యం చేస్తున్నవీ
తోట లోని పూలన్నీ విచ్చుకుంటున్నాయి.!!

రాలిపోయిన ఆకు చింత లేకుండా చిగురిస్తుంది.
భ్రమరం అమృతం తాగి బ్రహ్మగా మారింది
చిలుకలన్ని సీతాకో చిలుకలై ఎగురుతున్నవీ

గంధర్వుల గానం ఆరంభమైంది
విల్లు విరుచ లేదు
గదా ఎత్తలేదు
శంఖం పూరించలేదు
పూలమాలతో అలంకరించిండు
పరిమళం లా పరిణయమాడిండు!!!!

డా. ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు