ఆదర్శ దంపతులు... శ్రీసీతా రాములు (అష్టాక్షరీ గీతి )
 🔆ఆదర్శ గృహస్థుడైన 
జానకికి పతియైన
    రామయ్యయే మాకు తండ్రి
శ్రీరామ! జయ శ్రీరామ! (1) 
     
🔆ఆదర్శ గృహిణియైన
రామునకు సతియైన
    సీతమ్మయే మాకు తల్లి!
శ్రీరామ! జయ శ్రీరామ! (2)
           ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
 
🌻శ్రీసీతా రాముల.. సకల మానవాళికి ఆదర్శ దంపతులు! రామయ్య ... గృహస్థ ధర్మమును ఆచరించిన పురుషోత్తముడు! అదే విధంగా, సీతమ్మ  గృహిణి ధర్మము అనుసరించిన మహాసాధ్వి! ఆ సీతా రాములే.. మనకు ఆదర్శ మూర్తులు! వారే మనకు తల్లిదండ్రులు! వారి
 దివ్యగాథ.. శ్రీమత్ రామాయణము! 
 🪷శ్రీరామకథ లో... భారతీయకుటుంబ జీవన విధానమును.. వివరించారు, వాల్మీకి మహర్షి! అమ్మ నాన్నలు.. అన్న దమ్ములు.. అక్క చెల్లెళ్ళు.. బంధువులు.. స్నేహితులు.. ఇరుగు పొరుగు వారితో.. గృహస్థులు ఏ విధంగా.. ధార్మిక జీవనం  కొనసాగించవలెనో .. రామాయణంలో  పేర్కొన్నారు! 
🔱"శ్రీసీతా రామాభ్యాం నమః!" అని,రెండు చేతులను జోడించి,ఆదర్శ దంపతులైన శ్రీసీతా రాములకు  నమస్కరించు చున్నాము, మనమంతా!
      శ్రీసీతారాముల కల్యాణం... మానవాళికి మంగళకరమైనది! ఈ జగతికి శ్రేయోదాయక మైనది! శ్రీరస్తు! శివమస్తు!
         🚩 శార్ధూల వృత్తం
      శ్రీమార్గుండు శుభాకరుండు సుగుణశ్రీ జానకీ వల్లభుం
      డై, మంచిన్, వరధర్మమున్ నిలుపగా నానందమున్ గొల్పఁగాఁ
      బ్రేమన్ ధాత్రిని భారతీయ విభవశ్రీనిన్ లసజ్జానకీ
      రాముండై మనగుండెలన్ నిలిచి సంరక్షించుతన్ నిత్యమున్.
    [ రచన:- "కవికల్ప భూజ" చింతా రామకృష్ణా రావు.,]
*********************
        🚩సీస పద్యము 
     జగదేక వీరుడు జగదభి రాముడు
శ్రీరాముడు వరుడై చేరి రాగ
      అతిలోక సుందరి యా గుణమంజరి
సీతమ్మ వధువయ్యి  సిగ్గు పడగ
       ముక్కోటి దేవత లొక్కటై ముదమార
నాశిస్సు లందియ్య నరుగుదెంచ  
     కౌశికాదిమునులు ఘనవశిష్ఠ గురులు
పెండ్లి పెద్దలుగాను వేచియుండ
      దశరధ జనకులు తన్మయత్మము నొంద తనయుల పెండ్లికి తనివిచెంద 
         (🚩తేట గీతి) పద్యము        
       ఋషుల వేద మంత్రంబులు శ్రేయము లిడ
ఎలమి మంగళ వాద్యాలు మిన్నుముట్ట 
      కూర్మి లోకకళ్యాణముఁ గోరి నేడు
 జానకీరాము లాదర్శజంట యయ్యె!
       [రచన:- డా. ఎం. ఎన్. వి. ప్రసాద్.,]
🕉️ శ్రీరామ! జయ శ్రీరామ! జయ జయ శ్రీరామ!
   (శ్రీ రామ షోడశాక్షరీ (16) నామ మాలిక.,)

కామెంట్‌లు