నా కలంకబుర్లు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఎవరు నేర్పారమ్మ
ఈ కలముకు
కమ్మని
కవితలను కూర్చమని

ఎవరు చెప్పారమ్మ
ఈ కలముకు
ఆలోచనలకు
అక్షరరూపము నివ్వమని

ఎవరు ఇచ్చారమ్మ
ఈ కలముకు
ప్రకృతిని అర్ధంచేసుకునేశక్తి
పుటలపై భావాలనుపెట్టేయుక్తి

ఎవరు అర్ధించారమ్మ
ఈ కలమును
అందాలను అందించమని
ఆనందాలను పంచిపెట్టమని

ఎవరు శాసించారమ్మ
ఈ కలమును
పూలకవితలను
పెక్కుటిని అల్లమని

ఎవరు అడిగారమ్మ
ఈ కలమును
కాలాన్నికేటాయించమని
కడుకైతలను కాగితాలపైపెట్టమని

ఎవరూ కోరారమ్మ
ఈ కలమును
రెచ్చిపొమ్మని
రసరమ్యగీతాలను రాయమని

ఎవ్వరూ 
ఈ కలమును
నానుండి
లాక్కోవద్దు

ఎవ్వరూ 
ఈ కలమును
నానుండి
వేరుచేయవద్దు

ఎవ్వరూ 
ఈ కలాన్ని
గాయాలపాలు
చేయవద్దు

ఈ కలం
నా హృదయం
ఈ కలం
నా ప్రాణం

ఈ కలం
నా ఉచ్ఛ్వాస
ఈ కలం
నా నిశ్వాస

కలమే
నా ప్రతిక్షణం
కలమే
నా ప్రతిదినం

నా కలం
నా బలం
నా నేస్తం
నా జీవితం


కామెంట్‌లు