'ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లోనే సృజనాత్మకత';--శ్రీరాంపూర్ ఎంఈఓ టి. సురేందర్ కుమార్

 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లోనే సృజనాత్మకత అధికంగా ఉంటుందని, అందుకు కారణం ప్రభుత్వ పాఠశాలల్లో కృత్యాధార బోధనతోపాటు భావనల ఆధారిత విద్యను అందించడమేనని శ్రీరాంపూర్ ఎంఈఓ టి. సురేందర్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ అధికారి సిరిమల్ల మహేష్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పిల్లలు సమయం వృధా చేసుకోకుండా పాఠశాలలో చెప్పిన పాఠాలను ఇంటి వద్ద చక్కగా చదువుకోవాలని ఆయన సూచించారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఇంటివద్ద తమ పిల్లల విద్య పట్ల జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ అధికారి సిరిమల్ల మహేష్ మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రత్యేక చొరవ తీసుకొని  పాఠశాల ఉపాధ్యాయినుల సహకారంతో పాఠశాలను, పిల్లల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్లసమ్మయ్య మాట్లాడుతూ మూతపడే స్థితిలో ఉన్న ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను లక్షలాది రూపాయలు తన సొంత డబ్బును వెచ్చించి, అభివృద్ధి చేయడమే కాకుండా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సకల సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ పాఠశాలలోనే చేర్పించి, నాణ్యమైన విద్యను పొందాలని ఆయన కోరారు. పాఠశాల వార్షికోత్సవంలో చిన్నారులు ఉత్సాహంతో గంతులు వేశారు. పిల్లల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. తమ పిల్లలు చేస్తున్న నృత్యాలను చూసిన తల్లిదండ్రులు మిక్కిలి సంతోషపడ్డారు. శ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నరెడ్ల సునీత చేతుల మీదుగా పాఠశాల పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఒకటి నుంచి 5వ తరగతి వరకు రెండవ సమ్మేటివ్ అసెస్మెంట్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన 15 మంది బాలబాలికలతో పాటు సంవత్సరంలో అత్యధిక రోజులు బడికి హాజరైన ఎనిమిది మంది బాలబాలికలను గుర్తించి వారికి బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో హెచ్ఎంలు నరెడ్ల సునీత, ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, చెన్నూరి భారతిలతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు