సునంద భాషితం;- ,వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -478
గడ్డురికా న్యాయము/గడ్డులికా ప్రవాహ న్యాయము
*****
గడ్డురికా లేదా గడ్డులికా న్యాయము అనగా  గొర్రెల మంద ప్రవాహంలో  కొట్టుకు పోవడం.
గొర్రెల మందలో ఒకటి ప్రమాదవశాత్తూ  ప్రవాహంలో పడిపోతూ వుంటే తక్కిన వాటిని అందులో పడిపోకుండా ఎంత ప్రయత్నించినా తక్కినవన్నీ ఆగకుండా అందులో పడిపోతూనే వుంటాయి అంటే దూకుతూనే వుంటాయి.
గొర్రెల మంద లక్షణమే అది. ఒకటి దారి తప్పితే మిగతా వన్నీ అలాగే దారి తప్పుతాయి.వాటిని వారించి మంచి వైపు మళ్ళించినా అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంతో ముందు దానినే అనుసరిస్తాయి.అలా  అన్నీ అపాయానికి గురవుతాయి.
 కొందరు మనుషులు కూడా అంతే.ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు .వాళ్ళు ఎందుకలా చేశారు?అది మంచా? చెడా ?అనే ఆలోచన, వివేచన, విజ్ఞత,శూన్యం అన్న మాట.
వీళ్ళది మామూలు అమాయకత్వం కాదు. మూర్ఖత్వంతో కూడిన అమాయకత్వం. ఎలాంటి ఆలోచన వుండదు. గుంపుగా వుంటారు.అందులో ఎవరో ఒకరు ఏదైనా చేస్తే మిగిలిన వారు అదే తు చ తప్పకుండా చేస్తారు.
ఇలాంటి వారిని తేలికగా నమ్మించి మోసం  చేయడం తేలిక.అందువల్ల వాళ్ళను మోస చేసేవారు  ఉంటారు.అందులో ఒక్కరిని మోసం చేస్తే చాలు మిగతా అందరూ అలాగే మోసపోతారు.
ఇలాంటివి ఎక్కువగా ఫైనాన్షియల్ కంపెనీలు, డబ్బు  ఒకటికి పది రెట్లు అవుతుందని, ఒకరికి చెప్పి తద్వారా   మిగిలిన వాళ్ళను  అందరినీ అవలీలగా మోసం చేస్తారు.
ముఖ్యంగా దొంగ బాబాలు, స్వాములు కూడా ఇలాంటి అమాయకులను తేలికగా మోసం చేస్తుంటారు.
ఇక మూడ నమ్మకాలైతే సరేసరి. వాటిని పాటించడంలో వీళ్ళు మొదటి వరుసలో వుంటారు. రాజకీయ కార్యకర్తలు కూడా అంతే.
ఈ మంద లాంటి మనస్తత్వాలను మార్చుకోక పోతే జీవితమంతా ఇతరుల చేతుల్లో మోసపోవలసిందే.కాబట్టి చిన్నప్పటి నుండే తెలివి తేటలు, స్వీయ నిర్ణయ శక్తి పెరిగేలా చూడాలి.


కామెంట్‌లు