సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -476
కార్పాస రక్తతా న్యాయము
*****
కార్పాస అనగా దూదితో చేసినది, కాగితము,పత్తి చెట్టు.రక్తతా అనగా రంగు వేయబడిన, ఎఱ్ఱనైన, అనురాగ యుక్తమైన, ప్రియమైన, మధురమైన అనే అర్థాలు ఉన్నాయి.
ఎఱ్ఱని లక్కలో నాన బెట్టిన పత్తి విత్తనాలను పాతి పెట్టినట్లయితే ఆ మొక్కల నుండి ఎఱ్ఱని పత్తి వస్తుంది అని పెద్దలు చెప్పిన విషయం.
అనగా ఎఱ్ఱ రంగులో నానవేసి నాటిన ప్రత్తి గింజల నుండి ఎఱ్ఱని పత్తి పుడుతుందని వాళ్ళు నమ్మకంతో చెప్పారు.
దీనినే  తెల్లని ప్రత్తి ఇవ్వాల్సిన ప్రత్తి గింజ రంగుల్లో నానేసరికి ఆయా రంగుల్లోకి దాని స్థితి ఎలా మారిపోతుందో అలాగే మనిషి కూడా దేనిని చేస్తే దానికి సంబంధించిన ఫలితాలు పొందుతాడని అర్థము.
అనగా కర్మానుసారంగా శుభాశుభ ఫలితాలు వుంటాయి అనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ "కార్పాస రక్తతా న్యాయము"ను ఉదాహరణగా చెప్పారు.
ఇలా ప్రత్తి గింజలను ఎర్రని లక్కలోనో, ఎఱ్ఱని రంగులోనో ముంచి నాటితే ఎరుపు రంగు ప్రత్తి వస్తుంది లేదా వచ్చింది అనేది  బహుశా ఎవరూ వినివుండక పోవచ్చు.
కానీ రంగుల పత్తిని పండించడం మాత్రం కొత్తేమీ కాదనీ,.ఐదువేల సంవత్సరాల క్రితం మొహంజోదారో  నాగరికతా  జీవన విధానాన్ని పరిశోధన చేసినప్పుడు అప్పటి ప్రజలు నాలుగైదు రకాల ప్రత్తి పంటను పండించినట్లు తెలిసింది.
అయితే ఎఱ్ఱ లక్క, లేదా ఎఱ్ఱ రంగులో  ముంచడం వల్ల అలాంటి రంగు పత్తి వస్తుందనేది నిజమో కాదో తెలియదు కానీ మన ప్రత్తి శాస్త్రవేత్తలు  అనేక రకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి నేడు రంగు రంగుల ప్రత్తిని పండిస్తున్నారు.
 ఎలాగూ ప్రత్తి గురించి చెప్పుకుంటున్నాం కనుక ఆ ప్రత్తికి సంబంధించి కొన్ని వివరాలను, విశేషాలు తెలుసుకుందామా...
ప్రత్తి అనగానే  నల్లని చేనులో ధవళ వర్ణంతో మెరిసిపోయే ప్రత్తి పువ్వు గుర్తుకు వస్తుంది.
పత్తి పూలు విరిసినప్పుడు చూడాలి.ఎంత అందంగా కనిపిస్తాయో... ఆకాశంలో తెల్లని మబ్బు తునకలు ముద్దు ముద్దుగా  పూల రూపం దాల్చి నల్లని ఆకాశం లాంటి పొలంలో కొలువు తీరాయా " అనిపిస్తుంది.
ఇక ముట్టుకుంటే మెత్తగా తాకే ఆ స్పర్శ పసిపాపల మృదువైన చెక్కిళ్ళు తాకినట్టుగా అనిపిస్తుంది.ఇలా చూస్తున్నా, ముట్టుకున్నా మనసుకు హాయి గొలిపే పత్తి అంతటితో ఆగిపోలేదు. పత్తి నూలుతో తయారైన వస్త్రాలు  ధరిస్తే శరీరానికి  మెత్తగా తాకుతూ మనసు శరీరాలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.
మరి ఈ "కార్పాస రక్తతా న్యాయము" ప్రకారము తెల్లని, స్వచ్ఛమైన పత్తి కూడా  రంగుల్లో ముంచితే తనదైన అస్థిత్వాన్ని కోల్పోతుందనేది తెలిసింది కదా!.
దీనినే ఆధ్యాత్మిక  వాదులు తమదైన దృష్టితో చూస్తూ మనిషి చేసే కర్మలను బట్టే శుభాశుభ ఫలితాలు వుంటాయని చెప్పారు.
భగవద్గీతలో  "జంతునాం నరజన్మ దుర్లభం" అంటారొక చోట.అంటే జంతువులన్నింటిలో మానవ జన్మ ఉత్తమమైనది అని అర్థము.
ఈ ఉత్తమమైన జన్మను సర్వోత్తమంగా మలుచుకోవాలంటే మంచి కర్మలు చేయాలి. కర్మలను బట్టే కర్మ ఫలాలు వుంటాయి.ఎలాంటి కర్మల విత్తనాలు నాటితే అలాంటి కర్మల ఫలాలను  పొందగలం .
అందుకే పెద్దవాళ్ళు మనం ఇతరులకు మంచి చేస్తే మనకు అవసరమైనప్పుడు ఎవరో ఒకరి ద్వారా మనకూ మంచి జరుగుతుంది అంటారు.
ఈ న్యాయం ద్వారా మనం చేసే మంచి చెడుల కర్మలను బట్టే ఫలితాలు వుంటాయనేది గ్రహించగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు