సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -477
కులాల చక్ర కీట న్యాయము
*****
కులాల అంటే కుమ్మరి. కులాల చక్రము అంటే కుమ్మరి చక్రము,బండి చక్రము, విష్ణువు ఆయుధ విశేషము, సమూహము. కీట అంటే పురుగు.
కుమ్మరి చక్రం అంటే కుమ్మరి వ్యక్తి మట్టి పాత్రలను చేయడానికి గుండ్రని చక్రం ఆకారంలో తయారు చేయబడిన చక్రము.దీనిని కుమ్మరి సారె అని కూడా అంటారు.
కుమ్మరి వ్యక్తి తిప్పే చక్రముపై  వాలి ఉన్న పురుగు ఆ చక్రంతో బాటు వేగముగా గిరగిరా తిరుగుతుంది.
అలాగే "సంసార చక్రమున దేహం కూడా జనన మరణాది భ్రమణ వేగమున గిర్రున తిరుగుతూనే ఉంటుంది" అనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ "కులాల చక్ర కీట న్యాయము" ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఇక్కడ మానవుడిని ఓ పురుగు లాంటి దేహంతో పోల్చడం జరిగింది.ఏదో ఆశించిన దేహంలోని దేహాత్మ సంసారమనే కుమ్మరి చక్రంపై వాలుతుంది.అలా జననం  నుండి మరణం దాకా అనేక అవస్థలు, స్థాయిలు దాటుకుంటూ తిరుగుతూనే వుంటుంది.
మరి ఈ సంసార చక్రము గురించి, అందులో భ్రమణం చేసే జీవాత్మ లేదా దేహాత్మ గురించి భారతీయ మతాలలో చాలానే నమ్మకాలు ఉన్నాయి.అయితే హిందూ మతంలో ఈ సంసార చక్రము కర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉంది. సంసారం,విముక్తి అనేవి ఆధ్యాత్మిక అన్వేషణలో ప్రధానమైనవి.ఇందులోసంసారం అనేది ఆత్మ యొక్క ప్రయాణంగా చెప్పబడింది.
కేవలం  ఒక్క హిందూ మతములోనే ఈ నమ్మకం ఉందా?అంటే కాదనే చెప్పాలి. జైన మతం కూడా ఒక కర్మతో కూడిన సంసార చక్రంలో ఆత్మలను బహువచనంగా పరిగణిస్తుంది.
ఇక బౌద్ధ మతం ఈ సంసార సంబంధిత పునర్జన్మ మరియు బాధల సంబంధించిన చక్రాలను అంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నది.
సిక్కు మతములో  కూడా పై మూడు ప్రాచీన భారతీయ సంప్రదాయాల విధంగానే శరీరం నశించిపోతుందనీ, పునర్జన్మ చక్రం ఉందనీ, పునర్జన్మ యొక్క ప్రతి చక్రంలో బాధ వుంటుందని నమ్ముతుంది.
ఇలా దాదాపుగా అన్ని మతాల్లో సంసార చక్రమును గురించిన ప్రస్తావన వుందనేది మనకు స్పష్టమైపోయింది.
దీని గురించి పోతన రాసిన భాగవతం లోని తృతీయ స్కంధంలో "విదుర మైత్రేయ సంవాదము"లో కూడా వుంది.అందులో ఏముందో చూద్దాం.
విదురుడు మైత్రేయ మహాముని పాదాలకు నమస్కరించి, చేతులు జోడించి లోకంలోని ప్రజలంతా తమ తమ మనస్సులలో ఎల్లప్పుడూ సుఖాన్నే కోరుకుంటారు.దానిని పొందడానికి ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారు. చేసే కర్మ ప్రయత్నాలు అనుకూలించక తమకు కావలసిన ఫలాలను అందుకోలేక పోతున్నారు. ఈ కర్మలన్నీ ప్రతిబంధకాలుగా నిలిచి దుఃఖానికి కారణమైన సంసార చక్రములో ఇరుక్కుని గిరగిరా తిరుగుతూ వుంటారు.ఇలా కోరికల వ్యామోహంలో చిక్కి చస్తూ పుడుతూ వుంటారు కదా! అంటాడు.అందుకు మైత్రేయ మహాముని సంతసించి సృష్టి రహస్యంతో పాటు భగవంతుడు,విముక్తి , సంసార చక్రమును గురించి వివరంగా చెబుతాడు.
 మరి ఈ జనన మరణ చక్రంలో చిక్కుకోకుండా వున్నట్లయితే భగవంతుని యొక్క పరంధామమునకు చేసుకోవచ్చునని, అక్కడికి వెళ్ళిన తరువాత జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగి రారని, అక్కడికి చేరుకున్న జీవులు ఈ జనన మరణ సంసార చక్రమును దాటి పోతారని  భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో  చెబుతాడు.
మరి సంసార చక్రమును దాటడం అంత సులభమా?అంటే కాదనేది అందరికీ తెలుసు.కానీ ప్రయత్నం అవసరం. ఆ దిశగా మరల్చే వారు కూడా అవసరం.
ఈ సందర్భంగా ఓ నిజ జీవిత కథను చూద్దామా.
 హిందీలో రామ చరిత మానస్ పేరుతో రామాయణం రాసిన సంత్ తులసి దాస్  ఇందుకు మంచి ఉదాహరణ.
ఆయన యుక్త వయస్సులో ఉన్నప్పుడు భార్య పట్ల అమితమైన మమకారానురాగాలు వుండేవి. ఒకసారి ఆమె తన తల్లిదండ్రుల వద్దకు కొద్ది రోజులు ఉండటానికి వెళ్ళింది.ఆమె ఎడబాటును తట్టుకోలేక పోయాడు. వెంటనే ఆమెను చూడటానికి బయలుదేరాడు.దారిలో ఓ వాగు వుంది.అదే సమయంలో పెద్ద వర్షం కురుస్తూ వుండటం వల్ల పడవ వాళ్ళు వాగు దాటించడానికి ఒప్పుకోలేదు.ఎలాగైనా భార్యను కలవాలనే కోరిక తప్ప మరో ఆలోచన లేకపోవడంతో ఎదురుగా నీళ్ళలో కొట్టుకుని పోతున్న శవాన్ని  ఓ దూలం అనుకున్నాడు. దానిని పట్టుకొని వాగు దాటాడు.అలా పది మైళ్ళ దూరంలో ఉన్న భార్య ఇంటికి చేరాడు.అర్థరాత్రి , చిమ్మ చీకటి. భార్య మేడ మీద ఉంటుందని తెలుసు. చీకట్లో తాడు అనుకుని పామును పట్టుకొని పైకి ఎక్కాడు. తలుపు తట్టగానే భార్య తలుపు తీస్తుంది. తాను  ఎలా వచ్చిన విషయం విన్న తర్వాత, ప్రత్యక్షంగా చచ్చి పడి ఉన్న పాముని చూసిన తర్వాత భార్య రత్నావళి చలించిపోతుంది. "ఈ రక్తమాంసాల మీద ఇంత పిచ్చి, వ్యామోహం కూడదు. ఇదే పిచ్చి మరియు భక్తి భగవంతునిపై చూపించినట్లయితే ఈ సంసార చక్రమును దాటి అమరత్వాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని పొందేవాడివి" అని సున్నితంగా మందలిస్తుంది.ఆ మాటలు తులసీదాస్ మనసును మార్చేస్తాయి. వెంటనే  రాముని గురించి తపస్సు చేసి ఆధ్యాత్మికత యొక్క ఉత్కృష్టమైన ఎత్తుకు ఎదుగుతాడు.అత్యుత్తమమైన  రామచరిత మానస్, హనుమాన్ చాలీసా రాస్తాడు.
 
ఇలా మొత్తంగా చూసినప్పుడు మానవులు కోరికలు, ఆశలతో ఇంద్రియాలచే వ్యామోహితులై చక్రబంధంలో కులాల చక్ర కీటము వలె చిక్కుకు పోతారని అర్థమవుతుంది. మరి వాటి నుండి బయట పడాలంటే ఇంద్రయముల యొక్క కోరికలను ఆధ్యాత్మిక మరియు భక్తి దిశగా దృష్టి మరల్చేలా  చేయాలని ఈ కథ ద్వారా  మరియు ఈ  "కులాల చక్ర కీట న్యాయము" ద్వారా మనం తెలుసుకోగలిగాం.
 మనం ఇవి చదివిన తరువాత ఏం చేయాలో  ఒక స్థిరమైన అభిప్రాయం మనలో ఈ పాటికే చోటు చేసుకుని వుంటుంది. సంసార జీవితం నియమబద్ధంగా కొనసాగిస్తూనే చేసే మంచి కర్మలను భగవంతునికి సమర్పిస్తూ, అనన్య భక్తితో, అకుంఠితంగా ధ్యానం చేసే వారిని సంసార చక్రబంధం నుండి ఆ భగవంతుడే విముక్తి కలిగిస్తాడు. ముఖ్యంగా మన కర్తవ్యం ఏమిటంటే ఆధ్యాత్మిక హృదయంతో మంచి పనులు చేస్తూ జీవితం గడపడం.ఆ తర్వాత మన బాధ్యతనంతా ఆ పై వాడే చూసుకుంటాడు.

కామెంట్‌లు