క్రోధినామ ఉగాదిని స్వాగతిద్దాం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 క్రోధినామ ఉగాదిని స్వాగతిద్దాం రండి!
వసంతుడు వచ్చేశాడు కదూ?! అందుకేనేమో
కొమ్మ కొమ్మన కోయిల కూస్తూనే ఉంది 
రెమ్మ రెమ్మన వేప పూస్తూనే ఉంది
చెట్టు చెట్టున మావి కాస్తూనే ఉంది 
పిలవకుండానే చిలుక పలుకుతూనే ఉంది
మరింకేం!? మనసులో క్రోధమేమీ పెట్టుకోకుండా
ఉగాదిని స్వాగతిద్దాం రండి! 
నిన్నటి మోడు నేడు చిగురిస్తోంది
ప్రతి ఆకు మాటునుండి పూవు నవ్వుతూనే ఉంది
ఈ జగమంతా ఆనందనందనమై 
సింగారించుకుని వచ్చేస్తోంది
ప్రకృతి అంతా ఆనంద కందళితమై పులకరిస్తోంది 
అందుకే నేమో, ప్రతి మనిషిలో 
నూతన ఆశయాల శుభోదయమై 
సుందర స్వప్నాల నవోదయమై
శుభయోగాల నివేదనకై ఆరాటం 
కనుక, ఉగాదిని స్వాగతిద్దాం రండి! 
ఎన్ని రంగుల విభేదాలున్నా, 
ఎన్ని తరాల అంతరాలున్నా 
ఎన్ని వాదాల నినాదాలున్నా 
లోలోపలి భావాల గుండె చప్పుళ్ళన్నీ ఒకటేననే లక్ష్యం, 
ఏకత్వధైర్యం భారతీయుల జీవితం 
ఫలప్రదమయ్యేట్లు చేస్తోంది 
అందుకే అందరం కలిసి క్రోధినామ ఉగాదిని స్వాగతిద్దాం రండి! 
**************************************
కామెంట్‌లు