న్యాయాలు -473
ఖడ్గకోశ న్యాయము
*****
ఖడ్గము అంటే కత్తి,కరవాలము, ఖడ్గ మృగము,ఖడ్గమృగపు కొమ్ము. కోశము అనగా కొట్టు,నిధి, ధనము ,కత్తి యొర, జాజికాయ బెరడు, పుస్తకము,బొక్కసము,మొగ్గ, పండులోని గింజ,కాయ బంగారము లేక వెండి, నిఘంటువు,పదకోశము, గ్రుడ్డు, గర్భము,బంతి ,పాత్ర, గిన్నె పెట్టె, గృహము , మేఘము, ఒట్టు అనే అనేక అర్థాలు ఉన్నాయి.
ఖడ్గము అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఓ పొడవాటి ఆయుధము. సినిమాల్లో రాజుల నడుముకు ఓ పట్టీ అందులో ఎడమ చేతి వైపు ఒక కత్తి ఆకారంలో కత్తి ఒర. దానిపై పట్టుకునే పిడికిలి. ఆపై ఎప్పుడూ చెయ్యి వేసి వుంచే రాజు మన కళ్ళ ముందు దృశ్యమానం అవుతాయి.
ఇక ప్రముఖ నటుడు కాంతారావు,ఎంటీ రామారావు గారు మొదలైన నటుల జానపద సినిమాల్లో కత్తి యుద్ధం దృశ్యాలు తప్పకుండా కనిపించేవి.రాజుల సినిమాల్లో కత్తి యుద్ధం దృశ్యాలు వుండటం అనేది సర్వసాధారణంగా వుండేది.
ఇది తరాలుగా మానవ చరిత్రలో వాడబడిన ఆయుధం.పూర్వకాలంలో చక్రవర్తులు, ఝాన్సీ లక్ష్మీబాయి,రాణి రుద్రమదేవి,రాణి శంకరమ్మ మొదలైన వీర నారీమణుల చేతుల్లో కూడా ఈ ఖడ్గాలుండటం మనం చూశాం.
ఇలా ఒకరేమిటి రాజులు, సైనికులు, స్వాతంత్ర్యానికి ముందు పోలీసు బలగాలు, జమిందారులు, బాగా ఉన్నవాళ్లు ఈ ఖడ్గాలను ఉపయోగించే వారు.
ఖడ్గము ధీరత్వాన్ని, వీరత్వాన్ని, హోదాను ,హుందాతనాన్ని ప్రదర్శించే ఆయుధముగా వుండేది.
ఖడ్గముతో చేసే యుద్ధాన్ని కత్తి యుద్ధం అంటారు. ఇది కేవలం కత్తులతో చేసే పోరాటం.ఈ పోరాటం యుద్ధాలలో కానీ, ఇరువురి మధ్య కానీ జరుగుతుంది.అది చూసే వారికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది.ఇది చాలా భయంకరమైన, ప్రమాదకరమైన యుద్ధవిద్య. రాజుల పిల్లలకు, సైనికులకు చిన్నప్పటి నుండే ఈ విద్యలో శిక్షణ ఇప్పించే వారు.
నకుల సహదేవులు కత్తి యుద్ధంలో ప్రవీణులని మహాభారతంలో చెప్పబడింది. అంతే కాదు పద కవితా పితామహుడు అన్నమయ్య శ్రీమహా విష్ణువు చేతిలో వుండే నందకం అనే కత్తి అంశతో జన్మించాడని నమ్ముతారు.
అది ధరించిన వారిని చూస్తేనే ఎదుటివారికి గుండెల్లో రైళ్ళు పరుగెత్తేవి.
అందుకే "కత్తి ఒఱను చూసి కత్తి వుందని భయపడి పారిపోయినట్లు" అనే సామెత వాడుకలోకి వచ్చింది.
అలా పూర్వ కాలంలో తప్పు చేస్తే శిక్షలు కూడా చాలా భయంకరంగా వుండేవి. చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు అన్నట్లు ముద్దాయిలను కత్తులతో నరికే వారు. అందుకే"రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా" అని కూడా అనేవారు.
రాజుల చేతిలో ఉన్న కత్తి ఒఱను చూస్తేనే ఎదుటి వారు భయకంపితులు అయ్యే వారు.
అలా చేమకూర వేంకటకవి తాను రాసిన విజయ విలాసము కావ్యంలోని పద్యంలో అర్జునుడి శౌర్యాన్ని ప్రస్తావిస్తూ ఇలా అంటాడు.
"పాఱ జూచిన బరసేన పాఱ జూచు" అంటే శత్రు సైన్యం వైపు తేరిపారా చూస్తేనే పారిపోవడానికి సిద్ధపడుతుంది" అని.
అంతే కదా !ఇక చేతిలో ఖడ్గముందా? విల్లు వుందా ఆలోచిస్తారా? వ్యక్తి యొక్క పరాక్రమాన్ని బట్టి అతని చేతిలో కత్తి ఒఱ చూసినా కత్తే వుందని భయపడటం ఎలాంటిది అంటే 'పాము కుబుసం చూసి పాము అనుకుని బయటపడినట్లు " ఇది సహజమే కానీ అసహజం ఏమీ కాదని చెప్పడమే ఈ న్యాయము యొక్క ముఖ్యమైన వుద్దేశ్యం.
అంతెందుకండీ! పిల్లల చేతిలో బొమ్మ తుపాకీ చూసినప్పుడు దాని వల్ల అపాయం కాదని తెలిసినా భయపడుతుంటాం.ఎందుకంటే తుపాకీ చేసే పనేంటో తెలుసు కాబట్టి. అలా కొన్నింటిని చూస్తుంటే మనకు తెలియకుండానే అసంకల్పితంగా స్పందించడం జరుగుతుంది.ఇది కూడా ఆ కోవకు చెందినదే.
ఏవైనా భయం కలిగించేవి చూసినప్పుడు మనుషుల మానసిక లక్షణాలు ఎలా ఉంటాయో ?ఎలా స్పందిస్తారో చెప్పడానికి మన పెద్దలు ఈ "ఖడ్గ కోశ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి.ఉందాం.మీరేమంటారు?
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి