సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్
 న్యాయాలు-509
చిత్రామృత న్యాయము
****
చిత్రము అనగా చిత్తరువు, బొమ్మ,ఒక వస్తువు యొక్క ప్రతి బింబము.అమృతము అనగా నశింపని, మరణించని,సుధ,మృతము లేనిది అనే అర్థాలు ఉన్నాయి.నిత్య యవ్వనం, శాశ్వతత్వం వుంటాయి. అమృతాన్ని తాగిన వారు అమరులు అంటే మరణం లేని వారు అవుతారు
అలాగే పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఉపయోగించే అమృతం ఉంటుంది.అది పాలు, తేనె,పెరుగు, నెయ్యి, పంచదారతో చేస్తారు. దీనినేమో పంచామృతం అంటారు.
ఇక ఆయుర్వేదంలో అమృత్ అనే ఒక రకమైన హెర్బల్ టానిక్ కూడా ఉంది.ఇది మంచి ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయువు ఇస్తుందని నమ్ముతారు.
అయితే అమృతము కేవలం చిత్రంలో కనిపించి ఊరిస్తూ నోటికి అందక పోతే ఎంత బాధ ఉంటుందో చెప్పడానికి ఈ "చిత్రామృత న్యాయము"ను మన పెద్దలు ఉదాహరిస్తూ వుంటారు.
అసలు ఈ అమృతము ఎలా లభించిందో? ఆ కథేంటో చూద్దామా.
ఈ  అమృతము యొక్క ప్రస్తావన మహాభారతంలోనూ, భాగవతం,రామాయణంలోనూ,ఇతిహాసం , పురాణాలలోనూ వుంది.అంటే అమృతం గురించి చెప్పని హిందూ పురాణేతిహాసాలు లేవన్న మాట.
 దేవతలు,దానవులు క్షీర సాగర మథనం చేస్తున్నప్పుడు వెలువడిన పానీయమే అమృతం. రాక్షసుల బాధలు పడలేక  దేవతలు శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకోగా "క్షీరసాగర మథనం" గురించి చెబుతాడు.
ఆ విధంగా రాక్షసులు, దేవతలు కలిసి క్షీరసాగర మథనం చేయడంతో మొదట హాలాహలం, లక్ష్మీ దేవి, కల్పవృక్షం, కామధేనువు లాంటివి పుడతాయి .అనంతరం ధన్వంతరి అమృత కలశంతో ఆవిర్భవించడం జరుగుతుంది.అలా వచ్చిన అమృతాన్ని శ్రీమహా విష్ణువు జగన్మోహిని రూపంలో దేవతలకు మాత్రమే పంచడం చూసిన రాహువు కేతువులనే రాక్షసులు ఈ మోసాన్ని గ్రహిస్తారు.వెంటనే దేవతల రూపాలు ధరించి అమృతం సేవించడం, వారిని  గమనించిన  శ్రీమహావిష్ణువు వారి తలలను సుదర్శన చక్రంతో ఖండించడం జరుగుతుంది.ఇలా ఈ అమృతం వెనుక బోలెడంత కథ వుంది. 
ఇక విషయానికి వద్దాం. అమృతం అంటే తెలిసిపోయింది కదా! అలాంటి అమృతం మానవులైన  మనకు దొరక్క పోయినా  మన అమ్మల చేతి వంట ఎలా ఉంటుందో తెలుసు కదా! అమ్మ చేతి వంట అమృతంలా వుంటుందనేది గోరుముద్దలప్పటి నుండి తిన్న మన అందరికీ తెలుసు.
 మరి అలాంటి అమృతం చిత్రంలో కనిపించి ఊరిస్తూ నోటికి అందక పోతే...?  ఆ బాధ  గురించి వర్ణించడానికి మాటలు చాలవు.
అయితే  అమృతం గురించి చెప్పుకోవడం అంటే  కేవలం వంటే కాదు.అమృతం లాంటి అవకాశాలు,సమయాలు, ఘడియలు, స్నేహం కూడా లేకపోలేదు.
వివాహాది శుభకార్యాలలో  వారం ,వర్జ్యంతో పాటు అమృత ఘడియలు అనడం వింటుంటాం.
ప్రముఖ కవి రచయిత బాలగంగాధర తిలక్ గారు "అమృతం కురిసిన రాత్రి" అనే పేరుతో ఓ గొప్పదైన కవితా సంపుటిని వేయడం మనకు తెలిసిందే.
ఇంకా కొన్ని పనుల్లో కానీ ఏదైనా పరీక్షలకు హాజరయ్యే విషయంలో కానీ , ప్రయాణాలలో కానీ ఒక్క  క్షణం లేదా నిమిషం ఆలస్యం చేసినా అమృతం లాంటి అవకాశాలను కోల్పోతుంటాం.అలాంటి తప్పిదాలను చూస్తూ "అయ్యో !"ఆలస్యం అమృతం విషం" అయ్యింది కదా అని బాధ పడటం పరిపాటి.
మనం చేసిన  పొరపాట్ల వల్ల ఇవన్నీ కళ్ళముందు చిత్రామృతాలై కనబడి బాధిస్తూ,వేదిస్తూ వుంటాయి. గుండెను బరువెక్కించి చాలా రోజుల వరకూ మనసు తేలిక పడనీయవు.
కాబట్టి అమ్మ చేతి వంటనూ, అరుదైన అవకాశాలను చేజార్చుకొని  బాధ పడకూడదనే ఉద్దేశంతో చెప్పిన ఈ న్యాయాన్ని సదా గమనంలో పెట్టుకొని అలాంటివి జరగకుండా చూసుకుందాం. అంతే కదండీ!

కామెంట్‌లు