దేవతా వృక్షం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మర్రిమాను కింద
మరోచెట్టు ఎదగదు అంటారు
నిజమే!
ఎందుకో తెలుసా?
తనఛాయలోనే ఉండిపోతే
మిగతావృక్షాల అస్తిత్వం
ఎలా ప్రకటమవుతుంది?!
తన అస్తిత్వాన్ని
ఎలా ప్రకటించుకోగల్గుతుంది?!
తాను
ఎంత ఎత్తుకు ఎదిగినా
తనశాఖలు
ఎంత పొడవు పెరిగినా
తన ఊడలు
తనను మరిపించేలా అభివృద్ధి చెందినా
పరోపకారం కోసమే కదా?!
ఇందులో తన స్వార్థం
ఎంతమాత్రం లేదుకదా?!
బోయవాడు వాల్మీకి
గా మార్పుచెందడం
సిద్ధార్థుడు బుద్దుడుగా అవతరించడం
గురుకులాల్లోని శిష్యులు
విద్యార్జన సలపడం
వనాల్లో రుషులు, మునులు, యోగులు
తపమాచరించడం
గ్రామాల్లో పంచాయతీ పెద్దల
న్యాయాన్యాయ నిర్ణయాల వేదికవడం
ఈ వటవృక్ష ఛాయలలోనే కదా!
ప్రపంచంలో అత్యధికంగా
చల్లని నీడనందించే తరువు
ఇదొక్కటే కనుక
బాటసారులు సేదదీరేది
ఈ వృక్షపు నీడలోనే కదా!
పిల్లలకు ఆటస్థలమై
పెద్దలకు విశ్రాంతికలనమై
పక్షులకు ఆవాసనిలయమై
చైతన్య నిమంత్రణమై
ప్రకృతి కృతితంత్రమై
ప్రాణవాయు జనకయంత్రమై
అమ్మతనపు ఓరిమికి అద్భుతసూత్రమై
తరతరాల భారతీయవారసత్వానికి
నిలువెత్తురూపమై
ఆర్షధర్మసాధన చిహ్నమై
ఆవగింజంత విత్తనపు విశ్వరూపమై
వెన్నెల్లో ఆహ్లాదాన్ని,
చీకటిలో దిగ్భ్రమను కలిగించి
జీవితపు చిరుకోణాలను ఆవిష్కరించి
జీవితాంతం తనకుతాను
పరోపకారానికి అంకితమైంది
అలుపెరుగక
సమస్తప్రాణికోటికీ
సమన్యాయాన్నందించే దివ్యవృక్షమై
పవిత్ర పంచపల్లవాలలో ఒకటిగా
ఎంచబడుతున్న ఈ మర్రి
దేవతావృక్షమై పూజలందుకుంటోంది
వందల ఏళ్ళుగా నిలిచిఉన్న ఈ మర్రిమానులు
ఎన్నికావ్యాలకు రూపునిచ్చాయో!
ఎన్నికీర్తనలకు రాగాలనందించాయో!
ఎన్నినృత్యభంగిమలకు పురుడుపోశాయో!
ఎన్నిచిత్రాలకు ఊహలందించాయో!
ఎన్నిశిల్పాలకు జన్మనిచ్చాయో!
ఎంతమందికి న్యాయసలహాలనందించాయో!
అందుకే...
మర్రిమానును రక్షించుకుందాం!
తద్వారా
మన తరతరాల వారసత్వమూలాల్ని రక్షించుకుందాం!!!
**************************************

కామెంట్‌లు