నీవు నా ఊహాసుందరివి;- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 రామప్పగుడి 
శిల్పసుందరివో
ఎల్లోరాకుడ్య 
చిత్రసుందరివో
స్వర్గలోకములోని 
నాట్యసుందరివో
ఏమైతేనేమి కాని
నీవు నా సౌందర్య రాశివి!

ఆషాఢ నీలిమేఘానివో
పున్నమినాటి సంద్రపు అలవో
ప్రభాత తుహినకిరణానికి
విరబూసిన పుష్పానివో
ఏమైతేనేమి కాని
నీవు నా ప్రేమ రాశివి!

కాళిదాసు కృత
నాటకంలోని శకుంతలవో
మనుచరిత్ర లోని
విరహిత వరూధినివో
దృపదుని యజ్ఞపు
దివ్యఫలిత పుత్రికవో
ఏమైతేనేమి కాని
నీవు నా వలపు రాణివి!

తాజ్ మహల్ సుందర 
ప్రియ ముంతాజువో
మొగులే ఆజం హృదయ 
రాణి అనార్కలివో
దేవదాసు ప్రేమించిన   
మురిపాల పారువో
ఏమైతేనేమి కాని
నీవు నా అందాల భరిణివి!

రవివర్మ గీసిన 
సుందర చిత్రానివో
తాన్ సేన్ గాన 
దివ్య మాధుర్యానివో
సుబ్బులక్ష్మి సుమధుర
రాగ ఆలాపనవో
ఏమైతేనేమి కాని
నీవు నా ప్రేమోపాసన దేవివి!!
**************************************

కామెంట్‌లు