దశావతారాలు -దశ లక్షణాలు;- చెన్నా సాయిరమణి
 ఉపోద్ఘాతం-సృష్టికి ఎప్పుడు ఆపద కలిగినా అప్పుడు అవతారం ఎత్తి కష్టం తొలగిస్తానని భగవద్గీతలో కృష్టుడు చెప్పినదానికి తార్కాణంగా దశావతారాలు కనిపిస్తాయి. అయితే ఈ అవతారాలు కేవలం శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయటానికి మాత్రమే రాలేదు ఆ అవతారం నుండి కొన్ని లక్షణాలు చెప్తూ మనల్ని ఆచరణలో పెట్టుకోమని కూడా హితవు చేసాయి. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం..
మత్స్యావతారం -వేదాలు రాక్షసుడు తీసుకొని పోతే మత్స్య రూపం ఎత్తి కాపాడారు. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనం ఉన్న చుట్టూ ఏమైనా కష్టం కలిగితే మనకు ఎందుకులే అనే భావన పోగొట్టుకొని మనము అందులోని భాగమే కదా అన్న బాధ్యత తో మన వంతు సహాయం చేసి ఆ కష్టాన్ని పోగొట్టాలి. అలానే కదా సముద్రంలోని చేప చిన్ని ప్రాణి అయినా తన వంతుగా ప్రయత్నం చేయటం వలన ఆ నాడు వేదాలు కాపాడబడ్డాయి.
కుర్మావతారం -సముద్రమధనంలో పర్వతం క్రింద ఉండి విజయం తెచ్చి పెట్టింది. మన వలన ఎదుటివారికి గాని, సమాజానికి గాని మంచి జరుగుతుంది అంటే కాసేపు మన సమయం వారికీ వెచ్చించి సహాయం చేసే ఉదారత్వం ఏర్పరుచుకోవాలి అన్న విషయాన్ని  చెప్తుంది.
వరాహ అవతారం -చీకట్లోకి భూమి విసిరివేయబడితే వెతికి మరీ తీసుకోని వచ్చారు ఏదైనా కష్టం వచ్చినా లేదా ఏ విషయం తెలుసుకోవాలి అన్నా పరిశీలన లేకపోతే ఎప్పటికీ సమస్య తీరదు అన్న విషయం  చెప్తుంది.
నృసింహావతారం - ప్రహ్లాదుని నమ్మకం పోగొట్టకుండా స్తంభం లోంచి వచ్చి కాపాడటం. మనల్ని ఎవరైనా నమ్మితే  వారి నమ్మకం వమ్ము చేయకుండా కాపాడుకోవాలి అన్న విషయం  తెలుపుతుంది.
వామన అవతారం - మూడు అడుగులు అడిగి ముల్లోకాలను కొలిచాడు.మనం ఎంత గొప్పవారమైనా అవసరం అయినప్పుడు ఒదిగుండటం నేర్చుకోవాలి అని  తెలియజేస్తుంది.
పరశురామావతారం- సంకల్పం చేసుకొని గండ్రగొడ్డలితో క్షత్రియుల్ని సంహరించారు. ఒకసారి మనం ఏదయినా నిర్ణయం తీసుకుంటే ఎంత కష్టం కలిగినా పూర్తి చేయాలి అన్న విషయం చెప్తుంది.
రామావతారం - ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ధర్మం విడువకుండా ఎలా ఉండాలో చూపించారు. మనం మనచుట్టూ ఉన్నవారితో మనిషిగా ఎలా బ్రతకాలో తెలియజెప్పారు.
కృష్ణావతారం- పాండవులకు వెన్నుగా నిలబడి ధర్మస్థాపన చేశారు. అవసరం అయినప్పుడు లౌక్యం తో ఎదుటివారిని  ఎలా జయించాలో అన్న విషయం తెలియజెప్తుంది. 
బుద్ధావతారం- త్రిపురాసుల్ని సంహారం చేయుటకు ఆలోచనలని పక్కదారి పట్టించారు. మనిషిని ప్రభావితం చేసేది ఆలోచన అందుకే ఆలోచన ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో  చెప్తుంది.(ఈ అవతారం గౌతమ బుద్ధావతారం కాదు)
కల్కావతారం - దుష్టులను శిక్షించడానికి వచ్చే అవతారం. మన చుట్టూ చెడు జరిగితే వెనకడుగు వేయకుండా ధైర్యం గా మనమే ఆ చెడుని అంతం చేయాలని తెలిజేస్తుంది.
ఇలా ఒక్కోవతారం ఒక్కో లక్షణం చెప్పకనే చెప్తున్నట్టు ఉన్న ఆ భావాలని మనం గ్రహించి ఆచరణలో పెట్టుకొని ముందుకు సాగాలని దశావతరాలు చెప్తున్నాయి.
ధన్యవాదాలు 🙏🙏
చెన్నా సాయిరమణి

కామెంట్‌లు