మమతల తరువోజం ;- పిళ్ళా వెంకట రమణమూర్తి
కుసుమ ధర్మన్న కళాపీఠం 
===================
ప్రతి మనిషికి కన్నె వయసులా
ప్రతి మనసుకు నూత్న మధువులా
అనువిస్తూ, అనిపిస్తూ
తరవని ఒక సంద్రంలా
తరగని రస సాంద్రంలా
తిరుగాడే ప్రేమ
తపనోజ్వ్జల సీమ

అజిత సరళతర కమనీయంలా
అవని తలంచని ఆలోచనలా
అమలంగా, అమితంగా
అవనత ఘన మేరువులా
అగణిత సుఖ భావనలా
అలరించే ప్రేమ
ఆనందలలామ

చిరబంధపు నిర్మాణంలో
ద్వైతానికి నిర్యాణంలా
రససంగమ యోగంలో
సిద్ధాత్మకు పర్యాయంలా
మోహంలా, దాహంలా
మాయావృత నవ్యశిశువులా
ఆసాదిత దివ్య కాంతిలా
మోహరించే ప్రేమ
సహచరీ సుషమ

మనసును మరిగించే
ప్రేమంటే నాకిష్టం
ప్రేమను పోషించే
వయసంటే నాకిష్టం
వయసును మురిపించే
సొగసంటే నాకిష్టం
వీటన్నిటి సారూప్యం
నను పిలిచే మధురోష్ఠం

మధుయామిని మృదుల పాద మంజీరాలకు
నీ అడుగులు తోడైనప్పుడు,
పున్నాగపూల సందోహంలో
వెన్నెలకే పెళ్ళైనట్లు.
తారకలే పల్లకి పడుతూ
నీ అందం కలగా కంటూ
పాలపుంతలో పరుగిడినట్లు.

నిద్రించే వ్యోమభూమిలో
అదృష్టం తలుపులు తడితే,
తార కలే ధారలు కడితే
నీ వలపుల జలపాతమ్మే
వెన్నెల్లా నాపై పడితే
కౌగిటిలో నీ తేజం
మన మమతల తరువోజం

బాధించే తీపి సుఖాలు
సుఖపెట్టే చేదు బాధలు
నువు కట్టే కదంబ మాలలు
అవి కలజ్యోత్స్నా కల్హారాలు
సరసాంకుని తూణీరాలు.
"""""""""""""""""""""""""""""""""""""""""""""""


కామెంట్‌లు