సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్
 న్యాయాలు-508
చిత్రానల న్యాయము
    ******
చిత్రము అనగా చిత్తరువు, బొమ్మ,ఒక వస్తువు యొక్క ప్రతి బింబము.అనలము అనగా నిప్పు, అగ్ని 🔥, అగ్ని దేవుడు అనే అర్థాలు ఉన్నాయి.
బొమ్మ లోని నిప్పు వలె అనగా పేరుకు అగ్ని అయినప్పటికీ దాహకత్వాది గుణాలు లేకపోవడంతో దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అర్థము.
 అగ్ని అంటేనే వేడి, వెలుతురు నిచ్చేది .కాల్చే గుణం కలిగినది.
అగ్నిని  దేవునిగా కొలుస్తాము . అంతే కాదు ఆగ్నేయ దిశకు సంరక్షక దేవతగా పూజిస్తారు.
అగ్నికి ఎలాంటి పాపాలు అంటవని అంటారు.అగ్ని దేవుడు ఈ ప్రపంచంలో సర్వ వ్యాపియై ఉన్నాడనీ.తన జ్వాలల ద్వారా వినాశాలను,తప్పిదాలను  లయింపజేసి  లోకాన్ని పునీతం చేస్తాడనీ,అగ్ని తత్త్వం అనేది సత్య రూపమైనది అంటారు.
రామాయణంలో సీతమ్మను అగ్నిపునీత అనడం మనం చదువుకున్నాం.
ఈ ప్రపంచం అంతా పంచభూతాల నిలయం అంటారు.ఈ పంచభూతాల్లో అగ్నిని ప్రథముడుగా, ప్రకృతి శక్తులలో ప్రముఖమైన వాడు.ప్రధానమైన వాడుగా చెప్పుకుంటాం. ఈ విధంగా అగ్నితత్త్వం ప్రముఖ తత్వాలకు ఆలంబనగా వుందనీ,స్వర్గ ప్రాప్తి కావాలంటే అగ్నిని ఆరాధించాలని వేదాలు చెబుతున్నాయి.
"అగ్నికి వాయువు తోడైనట్లు" అనీ,"అగ్నిలో ఆజ్యం పోసినట్లు" అనే సామెతలు, "అగ్ని పరీక్ష" వంటి జాతీయం ఉన్నాయి.మనిషి హృదయాన్ని  అగ్ని గోళంతో పోలుస్తారు.ఏక్షణాన అగ్ని గోళం భళ్ళున పగిలి ముక్కలై పోతుందో అప్పుడే మనిషి శ్వాస ఆగిపోతుంది అంటారు.
అలాంటి  అగ్నికి సంబంధించిన "చిత్రానల న్యాయము"ను మన పెద్దలు వ్యక్తులకు ఎందుకు వర్తింపజేసి చెప్పారో చూద్దాం.
ఆయుర్వేదం ప్రకారం కానీ, మానవ మనస్తత్వాన్ని బట్టి గానీ పంచభూతాల గుణాలను మానవులకు అన్వయించి చెప్పడం జరిగింది.
ఈ విధంగా కొంతమంది అగ్ని తత్వము లేదా వ్యక్తిత్వాన్ని కలిగి వుంటారు.అంటే ఇలాంటి వారు ఉత్తేజకరంగా, చైతన్యవంతంగా వుంటారు.అతి సాధారణమైన పని కూడా ఉత్సాహభరితంగా చేయగల సామర్థ్యం ఉంటుంది. అంతే కాదు వీరిలో స్వతంత్రతా భావన అధికంగా ఉంటుంది.ఇతరులను అనుసరించడానికి ఇష్టపడకుండా తనదైన శైలిలో జీవించడానికి, పనులు చేయడానికి ఇష్టపడతారు. అంతే కాదు నాయకత్వ లక్షణాలు  వీరిలో కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు వ్యక్తిగత, వృత్తి పరమైన సంబంధాలను నిర్మించడంలో మిగిలిన వారి కంటే ముందుంటారు.
అంతటి మేధోశక్తి, సృజనాత్మక లక్షణాలు , స్వతంత్రత ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వారి లోని భావోద్వేగ మేధాశక్తి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.అలాంటప్పుడే జ్వాల వలె కాకుండా నివురు కప్పిన నిప్పులా బలహీనులుగా, స్తబ్దుగా మారే అవకాశం ఉంది. 
మరి అలాంటి వ్యక్తులు  చిత్రంలో అగ్నిలాగా నిశ్చేష్టులుగా,చైతన్య రహితంగా వుండకూడదు అనే ఉద్దేశంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పడం జరిగింది.
అనగా వారిలోని ఉత్సాహాన్ని, మేధోశక్తిని,సృజనాత్మకతను, చైతన్యాన్ని ఎల్లప్పుడూ సమాజ హితానికి అందిస్తూ ఉండాలనే అర్థం ఇందులో ఇమిడి ఉంది.
అలాంటి మనం కూడా కొంత అగ్ని తత్త్వం కలిగిన వారం.ఎందుకంటే పంచభూతాల్లోని అగ్ని  మనలో వుంది.కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా అగ్నిలా కాల్చిపడేసి మనదైన ధైర్యం, మేధో శక్తి ,సామర్థ్యాలతో అనుకున్నది  సాధించాలి.

కామెంట్‌లు