నవధాన్యాలతో అధిక పంట దిగుబడులు-బీసీఐ ఫీల్డ్ ఇంచార్జ్ అరుణ


 నవధాన్యాలను భూమిలో చల్లడం వల్ల అవి భూమిలో కలిసిపోయి పచ్చిరొట్టగా తయారవుతాయని, అందులోని పోషకాలు పంట మొక్కలకు అందడం వల్ల ఏపుగా పెరిగి అధిక పంట దిగుబడులు సాధించవచ్చని బీసీఐ కేశవాపూర్ ఉత్పత్తిదారుల సంస్థ ఫీల్డ్ ఇన్చార్జి  తూండ్ల అరుణ అన్నారు. శుక్రవారం ఆమె కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో నవధాన్యాలు - పచ్చిరొట్ట వినియోగంపై  రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ నవధాన్యాలైన గోధుమలు, కందులు, పజ్జోన్న, తెల్లజొన్న, మొక్కజొన్న, సెనగలు రాగులు, పెసళ్లు, జీలుగు విత్తనాల్లో అధిక పోషక విలువలు ఉంటాయని, వీటన్నింటినీ కలిపి భూమిలో చల్లడం వల్ల అవి పచ్చిరొట్టగా తయారై, పంట మొక్కలకు సూక్ష్మ, స్థూల పోషకాలను అందిస్తాయన్నారు. దీంతో పంట మొక్కలు ఏపుగా పెరిగి, అధిక పంట దిగుబడులనిస్తాయని ఆమె రైతులకు సూచించారు. దీంతో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించడానికి అవకాశం ఉందన్నారు. బీసీఐ కేశవాపూర్ పంట ఉత్పత్తుల సంస్థ ఆధ్వర్యంలో పందిళ్ళ  గ్రామానికి చెందిన చీర కొమురయ్యకు చెందిన ఎకరం భూమిలో ఉచితంగా 5 కిలోల నవధాన్యాలను పలువురు రైతుల సమక్షంలో చల్లారు. నవధాన్యాల వినియోగానికి సంబంధించిన ఫ్లెక్సీని గ్రామంలో ప్రదర్శిస్తూ రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.
కామెంట్‌లు