వ్యర్థరాత్రి;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఆమె అక్కడే వుంది
విచ్చుకున్న పువ్వునుంచి
ఒలుకుతున్న పరిమళంలా
మూసివుంచిన కళ్ళపై తడిఆరని ఆశ  
వెచ్చగా పాకుతోంది
నరాల్లోకి ప్రవహించిన
నివురులాంటి ఉప్పెన
ఎండిన ఆకులా రాలిపడింది
తీరాన్ని తాకని కెరటాలు ఎగసి
పడకుండానే ఆవిరయ్యాయి
కురవని మేఘమొకటి
చీకటి దుప్పటిలో మొహాన్ని దాచుకుంది
పేరు తెలీని పురుగేదో 
ఒంటిపై పాకి
చిరాకు పెట్టిన నిస్థబ్ధం..
ఆ రాత్రి మొత్తం!
పంటికింద నలుగుతున్న అసంతృప్తిలా 
వ్యర్థంగా కరిగిపోయింది!!
**************************************

కామెంట్‌లు