శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
706)సన్నివాసః -

సజ్జనులకు నిలయమైనవాడు 
సాధుజనుల కాశ్రయమిడువాడు 
సత్ కర్మలకు మూలమైనవాడు 
చక్కని నివాసంగా యున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
707)సుయామునః -

యమునా తీరమున యున్నవాడు 
గోపికలతోటి పరివేష్టితుడు
శ్రీ కృష్ణ అవతారం నందున్నవాడు 
రేపల్లె వాసులకు నాయకుడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
708)భూతవాసః -

సర్వభూతాలకునూ నిలయుడు 
ప్రాణి సమూహం తనలోనున్నవాడు 
చరాచరములు నింపుకున్నవాడు 
జగత్తునకు పర్యవేక్షకుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
709)వాసుదేవః -

మాయాశక్తిచే నిండియున్నవాడు 
సర్వం ఆవరించియున్నవాడు 
భౌతికముగా మార్మికుడైనవాడు 
వాసుదేవ నామమున్న వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
710)సర్వా సునిలయః -

సర్వమూ నిలిపియున్నవాడు 
సమస్తజీవులకునూ నిలయుడు 
భక్తులకు ఆశ్రయమునిచ్చువాడు 
సునిలయము అయినట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు