శంకర జయంతి ; - సి.హెచ్.ప్రతాప్

 సాక్షాత్తు పరమేశ్వరుని అవతారంగా భావించే ఆది శంకరుల కృపే ఈ రోజు హిందూ మతంలో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నాయనడంలో అతిశయోక్తి కాదు.అలాంటి వేదాలకు కూడా వక్ర భాష్యం చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతాల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దడానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్భంలో ఉత్తరాయణ పుణ్య కాలం వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. శంకరులు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఐదు సంవత్సరాల చిరుప్రాయంలోనే తల్లి ఆర్యాంబ శంకరులకు ఉపనయనం జరిపించింది. ఉపనయనం అయ్యాక ఆది భిక్షువుగా శంకరులు భిక్షాటన చేస్తూ ఓ పేదరాలి ఇంటికి వెళ్లి ఆమె ఇచ్చిన ఎండిపోయిన ఉసిరికాయను భిక్షగా స్వీకరించి, ఆ పేదరాలి ఇంటి ముందు నిలబడి కనకధారా స్తోత్రం చదివి ఆమె ఇంట బంగారు ఉసిరికాయలు కురిపించి ఆమె దారిద్య్రాన్ని పోగొట్టారు.శంకరులు ఐహిక సుఖాలపై వ్యామోహం లేక సన్యాసం స్వీకరించి దలచి తల్లి అనుమతి కోరగా ఆమె ఒప్పుకోలేదు. ఒక్కగానొక్క కుమారుడు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది కదా. కానీ శంకరులు తాను ఒక మొసలి చేత చిక్కబడి ఉన్నట్లు తల్లి తన సన్యాసం దీక్షకు ఒప్పుకుంటేనే మొసలి విడిచి పెడుతుందని చెప్పి తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరిస్తాడు.శంకరులు తన హిందూ ధర్మ పరిరక్షణ ప్రస్థానంలో భాగంగా మూకాంబిక, తిరుమల, పూరీ, కంచి, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్వితంగా తీర్చిదిద్దారు. పామరుల నుంచి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.శంకరాచార్య జయంతికి హిందూ మతంలో గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఆదిశంకరాచార్యుల 1236వ జయంతి.శంకరాచార్య జయంతికి హిందూ మతంలో గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది.  
కామెంట్‌లు