ఎన్నికలకు మూలం ఓటర్లు



 ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలనీ, ఎన్నికలకు మూలం ఓటర్లని జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు అన్నారు.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆయన నేడు శ్రీకాకుళం ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో తన ఓటుహక్కును వినియోగించుకొనిన అనంతరం మాట్లాడారు. తరగతి విద్యార్థుల, పాఠశాల విద్యార్థుల నాయకులుగా  ఎన్నిక చేసే ప్రక్రియ ద్వారా, సేవ, జవాబుదారీతనం, బాధ్యత, నాయకత్వ లక్షణాలను విద్యార్ధి దశనుండే బాలబాలికలు తెలుసుకుంటారని ఇది మంచి పరిణామమని ఆయన గుర్తు చేసారు. సాంస్కృతిక కమిటీ, ఆరోగ్య పరిశుభ్రత కమిటీ, గ్రంథాలయ కమిటీ, సమాచార కమిటీల వంటి బాలల సంఘాల ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అవగాహన పొందుతారని తిరుమలరావు అన్నారు. ఓటు వేయకపోవడమంటే దేశ స్థితి గతులపట్ల చర్చించే హక్కు కోల్పోయినట్లేనని ఆయన అన్నారు. 
ప్రజాస్వామ్య దశ దిశ ఓటు పయనం ద్వారానే సాధ్యమని, ఓటు ఒక దిక్సూచి అని తిరుమలరావు అన్నారు. ఓటును అమ్ముకోవడం అంటే నువ్వున్న ఇంటిని నువ్వే కూల్చేసినట్లని, 
నీ కుటుంబ సమాజ భవితవ్యాన్ని నువ్వు తాకట్టు పెట్టినట్లని హెచ్చరించారు. నీపై నీ ఐదేళ్ల తీర్పే నీ ఓటు అని, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక విధి ఓటు వేయడమని, దేశాభివృద్ధిలో నువ్వు భాగస్వామ్యం ఔతున్నట్లని తిరుమలరావు అన్నారు. ఓటుహక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి నువు విలువనిచ్చినట్లగునని, అదొక పవిత్రమైన బాధ్యత అని ఆయన అన్నారు. 
రాజ్యాంగం నీకిచ్చిన ఓటు అనే అస్త్రాన్ని సంధించీ, స్వాతంత్ర్యమిచ్చిన భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్య సంరక్షకుడై నిలవాలని తిరుమలరావు పిలుపునిచ్చారు.
కామెంట్‌లు