అమ్మ కన్నా ఆస్తి ముఖ్యమా?;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్(పుష్యమి)విశాఖపట్నం.
పురిటినొప్పులు పడి పునర్జన్మ నెత్తి
పుడమిపైకి నిను తెచ్చి
పొత్తిళ్లలో పెట్టుకు
పరవశించి ముద్దాడిందే
రక్తాన్ని చనుబాలు గా మార్చి  నీవు కాళ్ళతో రొమ్ములపై తన్నినా
ఆప్యాయంగా అనురాగంతో కన్నా అని మురిసిన ప్రేమమూర్తియే.
తాను తినకున్నా నీ కడుపునింపి గ్లాసెడు నీళ్లతో తృప్తి పడిందే.!

మలమూత్రాదులను తుడిచి
పసిడిబొమ్మాలా ఉన్నావని
అందం, ఐశ్వర్యం చూడక ముద్దాడిన మాతృమూర్తియే
నీ ఉన్నతికోసం  అహర్నిశలు  కంటికి రెప్పలా కాపాడిన తల్లి పరదేవతకు ప్రతిరూపమే.!

నేడు ఆమెను వార్ధక్యంలో చూడక పోవడమే కాదు
ఆమె మరణించి మూడు రోజులయిన
మానవత్వం మరచి
అమ్మ చేసిన సేవను విస్మరించి
ఇంట్లో ఫ్రిజ్ లో ఉంచి
ఆస్తి కోసం తగువులాడుకుంటున్న సంఘటన చూస్తే
అశాశ్వతమైన ఆస్తి అమృతమయి అమ్మకన్నా ఎక్కువా
అసలు మనుషులలో 
మానవత్వ మెక్కడ?
విజ్ఞులు, ప్రాజ్ఞులు ఆలోచించండి...!!
...........................

(సూర్యాపేట జిల్లాలో కందుల వారి గూడెం లో  మరణించిన  వృద్ద మాతృమూర్తి ని ఇంట్లో ఉంచి ఆస్తి వివాదం తేలే వరకు తల్లి కి దహన సంస్కారం చేయనున్న  సంఘటన  విని ఆర్ధ్రతతో
వ్రాసినది)


........................

కామెంట్‌లు