సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-500
ఘోటక బ్రహ్మ చర్య న్యాయము
   ****
ఘోటకం అనగా గుర్రము.బ్రహ్మచర్యము అంటే ఒక వ్యక్తి తన శరీరాన్ని మరియు మనస్సును పూర్తిగా సన్యాసి మార్గాల ద్వారా నియంత్రించుకోవడం.బ్రహ్మకు అనుగుణంగా ప్రవర్తించడం, కోరికలను అదుపులో ఉంచుకోవడం అనే అర్థాలు ఉన్నాయి.
మరి గుర్రము మనుషుల్లా బ్రహ్మచర్యం పాటిస్తుందా? పాటించదనే సమాధానం వస్తుంది. ఒకవేళ గుర్రంతో బ్రహ్మచర్యం పాటింపజేయాలి అంటే దాని పెంపకం దారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి వుంటుంది.ముఖ్యంగా ఆడు గుర్రాలతో కలవనీయరు.అంతే కాదు వాటి అవయవాలను తాటితో బిగించి వుంచుతారు.అలా ఎంత జాగ్రత్త పడినప్పటికీ ఒకో సారి కట్టిన తాళ్ళు తెగిపోయినప్పుడు అక్కడ ఆడుగుర్రం ఉన్నట్లయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మచర్యం పాటించదు.
అంటే అలా బలవంతంగా దానితో పాటింపజేయడం తప్ప దానంతట అది మాత్రం పాటించదు.అందుకే దాని బ్రహ్మచర్యాన్ని కాస్త  వ్యంగ్యంగా "ఘోటక బ్రహ్మచర్యం" అనే పేరుతో  పిలవడం విశేషం.
మరి ఈ "ఘోటక బ్రహ్మచర్యం" అనే జాతీయం గురించి బూదరాజు రాధాకృష్ణ గారు ఏం రాశారో  చూద్దామా..
 గుర్రం మనుషుల్లా బ్రహ్మచర్యం పాటిస్తుందనేది  శుద్ధ అబద్ధం.ఈ పదబంధాన్ని నక్క వినయం,బక ధ్యానం,పిల్లి శీలం అనే మాటలకు పర్యాయపదంగా వాడుతుంటారనీ.అంటే జరగని పని అనే అర్థంతో.ఘోటక బ్రహ్మచారి అంటే పెళ్ళి చేసుకోకుండానే పై చవులు మరిగిన వాడని అర్థం. కాని నిష్ఠతో ఉన్న మంచి బ్రహ్మచారి అని మాత్రం కాదు. 
ఇక గుర్రాల విషయానికి వస్తే వాటిల్లో సంయమనం చాలా తక్కువ.అందుకే పందెం గుర్రాలే కాకుండా బండి గుర్రాలు కూడా గోడిగలను చూడగానే (ఆడగుర్రం)అలవి తప్పుతాయన్న భయంతో అవయవాల దగ్గర తోలు పటకా కడతారు.అలా నిర్భంధం మీదనయినా బ్రహ్మచర్యం అవలంభిస్తుందన్న ఆశతో.
అయితే ఈ బ్రహ్మచర్యం అనే మాట గురించి అనంతామాత్యుడు తాను రాసిన భోజరాజీయంలో ఓ వాఖ్యానం చేశారు.
ఒకప్పుడు వశిష్టాశ్రమానికి ఎదురుగా గంగానదికి అవతలి ఒడ్డున దుర్వాస మహర్షి నిరాహార దీక్షతో తపస్సు మొదలు పెట్టాడు.గృహస్థుడైన వశిష్ఠుడు భార్య అరుంధతి ద్వారా పూటా పూటా తిండి పంపితే దుర్వాసుడు తృప్తిగా తిని తేన్చేవాడు. 
ఓ సారి గంగకు వరదలు వచ్చాయి.నది దాటేది ఎలాగంటే వశిష్ఠుడు భార్యకు ఉపాయం చెప్పాడు." సదా బ్రహ్మచారి చెప్పాడను".గంగ దారి ఇస్తుం"దని.ఎవరి విషయంలో ఈ మాట అన్నాడో తెలియక ఆమె భర్త చెప్పినట్లు చేసి దుర్వాసుడికి తిండి పెడుతుంది.తిరిగిపోయే మార్గం దుర్వాసుడిని చెప్పమంటే దుర్వాసుడు "సదా నిరాహారి చెప్పా"డని  చెప్పి దారి తీసుకొమ్మన్నాడు.
ఇంటికి వచ్చిన అరుంధతి భర్తను ఈ విడ్డూరమేమిటి? అంటుంది.వందమంది సంతానం కన్న వశిష్ఠుడు సదా బ్రహ్మచారి కావటమేమిటని విస్తుపోతుంది. "ప్రజాయై గృహ మేధినాం" అన్న ప్రతిజ్ఞ ప్రకారం పిల్లలను కనడానికి మాత్రమే సంసారం చేసిన తాను సదా బ్రహ్మచారినే అంటాడు వశిష్ఠుడు.
అలాగే తనంతట తాను భోజన ప్రయత్నం చేయక, అతిథి మర్యాదగా మరో గృహస్థుడు తెచ్చిపెట్టిన తిండిని నిరాకరించడం అమర్యాద,తప్పు కాబట్టి కడుపారా తిన్నా  కూడా తాను సదా నిరాహారినేనని దుర్వాసుడు భావించాడన్న మాట.
దీనిని రాధాకృష్ణ గారు మన రిలే నిరాహారదీక్షల  వారికి తారక మంత్రంగా ఉపయోగపడే కథ అంటారు.ఇలాంటి  బ్రహ్మచర్య విషయం ఇలా సంసారులందరికీ సరిపడే సంగతి. "ఘోటక బ్రహ్మచర్యం "అనేది వీలు పడనప్పుడు ఇలా ఆచరించే నిష్ఠే గాని, కావాలని అవలంబించే వ్రతం కాదన్న మాట.
ఇవండీ! "ఘోటక బ్రహ్మచర్య న్యాయము" యొక్క విశేషాలు. కాస్త వ్యంగ్యంగా, మరికాస్త సరదాగా ,లోలోపలి లొసుగులను ఎత్తి చూపినట్లుగా ఉంది కదా!
అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా కనిపించినప్పుడు ఈ "ఘోటక బ్రహ్మచర్య" న్యాయమును గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుందాం.

కామెంట్‌లు