శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి పద్యములు.
81.
కష్ట సుఖముల బడయుచు కాల మందు 
నొడ్డు జేరక తిరిగెడి యోడ వోలె 
నిండ మునిగిన నాకింత నెరవు జూపి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
82.
కాల చక్రపు టిరుసునఁ గలియ దిరిగి 
విసివి  వేసారి తుదకిల వెతలు బొంది 
మరచి పోయితి మనమెల్ల మాయ గప్పె 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
83.
కన్ను లందున గప్పిన కపట మాయ 
కాన లేరుగ నీదివ్య కాంతి నెవరు 
మాయ జాలము పోద్రోలి మమత జూపి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
84.
జవము జీవము లీయవే సాధు వినుత! 
చింత లన్నియు పరిమార్చి క్షేమ మొసగి 
కరుణ జూపగ రావయ్య కమల నయన! 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
85.
తనువు శాశ్వత మనియెంచి తనివి దీర 
కులుకు చుందురే మనుజులు కూర్మితోడ 
కాలి పోయిన కలియును గాలి లోన 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు