సుప్రభాత కవిత ; -బృంద
నిదురపోని కొలని నీరు
ఎదురు చూచు ఉదయం
కనులు తెరచిన కుసుమబాలల
కల వరమై  ఏతెంచు ఉదయం

శిలగ మారిన తలపులన్ని
ఓదార్పు కోసం వేచిన ఉదయం
కలతలన్నీ కనుమరుగయే
కృప కోసం నిరీక్షించు ఉదయం

నలుమూలల పేరుకున్న
నల్లని చీకటిని తరిమేసే ఉదయం
మేలుకున్న మనసులోన
మమతలుప్పొంగే ఉదయం

ఆగిపోయిన గాలులన్నీ
ఆశతీరగ సాగే ఉదయం
బోసిపోయిన వనములోన
కదలికలేవో మొదలయే ఉదయం

వెలుగురవ్వలు చిందిస్తూ
ఎడద దీపాలు వెలిగించు ఉదయం
వేయి మనసుల కోటి కలలను
సాకారమయే క్షణాలను తెచ్చే ఉదయం

ప్రశాంత చిత్తాన ప్రమోదాలు
ప్రభవించు ఉదయం
తలచిన తపించే తలపుల 
తనివి తక్షణమే తీర్చే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు