వైశాఖ మాసం విశిష్టత- సి.హెచ్.ప్రతాప్
 వసంత ఋతువులో రెండవ మాసం వైశాఖ మాసం. వైశాఖ మాసంగా పిలిచే ఈ నెలలో శ్రీ మహా విష్ణువును వివిధ అవతారాలలో పూజిస్తారు. ఈ మాసంలో శ్రీహరిని పూజించడం వల్ల భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ వ్యక్తిపై ఉంటుంది. అంతేకాదు మీరు ధన లాభం, అదృష్టం పొందనున్నారు. అందుకే వైశాఖ మాసాన్ని అత్యంత పవిత్ర మాసంగా పరిగణిస్తారు. అందుకే ఈ కాలంలో పూజలు, శుభకార్యాలు, వివాహ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. ఇదిలా ఉండగా వైశాఖ మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరగడమే కాదు.. ఐశ్వర్యం, ఆదాయం లభిస్తాయని పండితులు చెబుతారు. వైశాఖ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖ మాసంలో సూర్యుడు మేష సంక్రమణంలో ఉండగా ప్రాత: స్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకు ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది.వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం, నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది.ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి, ఇంద్రుడు .అందుకే ఈ మాసం అంతా స్నానం, ఉపవాసం, పూజలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో పరుశురాముని జయంతి, అక్షయ తృతీయ, మోహినీ ఏకాదశి, హనుమాన్ జయంతి వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి.ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టే వారికి అంతులేని పుణ్యం లభిస్తుంది. ఈ సమయంలో పేదవారికి పాదరక్షలు లేదా చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళతారని నమ్ముతారు.ఆర్థిక లాభం కోసం- ‘ఓంహ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః ’,గర్భం దాల్చేందుకు, బిడ్డల సంక్షేమం కోసం- ‘ఓం కలి కృష్ణాయ నమః’అందరి క్షేమం కోసం- ‘ఓం నమో నారాయణాయ’.అనే మంత్రాలు జపించడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.వేసవి.కాలం ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గొడుగులు, నీటి పాత్రలు, చెప్పులు వంటివి దానం చేయడానికి ఇది మంచి సమయం. ముఖ్యంగా ఎండలో పనిచేసే వారికి, జంతువులు, పక్షులకు కొన్ని ఆహార పదార్థాలు నీరు మొదలైనవి ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారు. మన జీవితం ఆనందమయం అవుతుంది. వైశాఖ మాసంలో పగటి పూట పొరపాటున కూడా నిద్రపోకూడదు. శాస్త్రాల ప్రకారం, ఈ కాలంలో కంచు పాత్రలో తినడం కూడా నిషేధించబడింది. ఈ నియమాలను ఎవరైతే అనుసరిస్తారో వారికి ఆరోగ్య పరంగా ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

కామెంట్‌లు