శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.- పూణే. మహారాష్ట్ర
 తేటగీతి పద్యములు

26.
సజ్జనాత్ముల బోషించు సత్త్వనిధివి
ధర్మరక్షణ సేయంగ ధరను బట్టి
జనుల బాధలు దీర్చెడి శ్యామలాంగ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
27.
వేంకటాద్రిపై విలసిల్లి వెతలు బాపి
యాదరంబున భక్తుల కభయ మొసగి
తీర్చుచుందువు కోరికల్ తెఱిపి లేక
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
28.
తామసంబగు గుణములు తగులు కొనగ
మూఢమతినౌచు నేనిట్లు ముఱికి యందు
మునిగి పోతిని కనలేక ముందుదారి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
29.
జ్ఞాన భిక్షను గోరితి నాదలోల!
చిన్మయాకార నా గోడు చెప్పికొంటి 
నెయ్య మలరఁగ నీవె నా నేస్తమంటి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
30.
భక్తు ప్రహ్లాదు గాచిన భర్త నీవె 
సాధు రక్షక నాకిమ్ము సద్గుణాళి
సాధ్వ సంబును పోద్రోలు సామి నీవె 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు