సునంద భాషితం- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-497
ఘటీ యంత్ర న్యాయము
****
ఘటీ అనగా అనగా ఏతము నీళ్లు చేదు రాట్నము.యంత్రము అనగా కష్టపడి చేయవలసిన పనిని కష్టపడకుండా చేయునట్లు ఏర్పరిచిన సాధన విశేషం, బీజాక్షర చక్రము, జంతికలు చేసే సాధన విశేషము, తిరుగలి ఎండ్రి, ఉపాయము.
ఘటి యంత్రం అనగా నీళ్ళు తోడే ఏతాము.
పూర్వం విద్యుత్ సరఫరా లేని కాలంలో  పంట పొలాలకు నీటిని పారించేందుకు ఏతం లేదా గూడ,మోట,గుల్ల,పంపు మొదలైన పరికరాలను ఉపయోగించేవారు. వీటిలో ఏతము బాగా వాడుకలో ఉండేది.
ఇప్పటి తరానికి ఏతం అంటే ఏమిటో,అది పని చేసే విధానం ఏమిటో తెలియదు కానీ ఆ రోజుల్లో  దానిని కనిపెట్టి ,అది పని చేసే విధానాన్ని గమనించి దానిని వ్యక్తుల మనస్తత్వానికి అన్వయించి చెప్పడం గొప్ప విషయం కదా!
ఏతమునకు సంబంధించి ఓ రచయిత రాసిన పాటను చూద్దాం..యాతమేసి తోడినా ఏరు ఎండదు/ పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు ..... గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు..."అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ  చాలా గొప్పది, జీవితాన్ని కాచి వడపోసి రాసిన పాట యిది.
ఏతము తన పని అయ్యేంత వరకు వంగి యుండి పని కాగానే మీదికి నిక్కును  అంటారు మన పెద్దలు. మరి  అదెలా పనిచేస్తుందో చూద్దాం.
 నీళ్ళ కోసం బావిలోకి ఏతాన్ని పంపినప్పుడు వినయంగా నీటిని తనలో నింపుకుని ఆ నీటిని ఒడ్డున ఉన్న కాలువలో గుమ్మరిస్తుంది. ఆ  పని అయిన తర్వాత నిటారుగా ఉండి పోతుంది. అలా పొలానికి పారే కాలువల్లోకి  ఏట్లోంచి కానీ,బావిలోంచి  కానీ నీటిని పారించేందుకు ఇది అనువైన సాధనంగా ఉపయోగపడేది .
 ఇందులో  రెండు రకాల కోణాలు ,అర్థాలు ఇమిడి ఉన్నాయి.  ఒకటి వివేకవంతుడైన  వ్యక్తి ఎప్పుడూ  శ్రమిస్తూ ఉంటాడనీ, ఇతరులకు ఏతంలా సహాయం చేసి, తృప్తితో  ఆనందంగా వుంటాడనీ,ఆ తర్వాత తలెత్తుకుని ఆత్మ గౌరవంతో  తలెత్తుకుని తిరుగుతాడనే అర్థము ఇందులో వుంది.
ఇక రెండవ కోణంలో చూసినట్లయితే... అవకాశవాది అవసరమైనప్పుడు వంగి వంగి దండాలు పెడుతూ తన పబ్బం గడుపుకుంటూ వుంటాడు.అవసరం తీరాక ఎవరినీ లెక్క చేయకుండా తల బిరుసుగా నిక్కుతూ  వుంటాడనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ "ఘటీ యంత్ర న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఇలా ఏతమును మనుషుల ప్రవర్తనకు వర్తింప జేస్తూ   ఇలాంటి న్యాయాన్ని సృష్టించిన నిశిత పరిశీలనా దృష్టికి ఆశ్చర్యం, ఆనందం కలుగక మానదు.
"ఘటీ యంత్ర న్యాయము" ద్వారా  ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే  అవకాశ వాద తత్వాన్ని వీడాలనీ,అందరికీ తలలో నాలుకలా పంట పొలానికి నీరందించి పచ్చదనం,పంట దిగుబడికి కారణమైనట్లుగా, ఇతరులకు  సహాయం చేయాలనే తత్వాన్ని  అలవర్చుకోవాలి. అంతే కదండీ.మంచితనమే మానవత్వమై పరిమళిస్తుంది మరి.

కామెంట్‌లు