రుధిర సేవా ఫలాలు;- కవిరత్న నాశబోయిన నరసింహ (నాన),ఆరోగ్య విస్తరణ అధికారి, 8555010108.
నీవు చేసిన 
ఓ మహా దానం
ఆశయాల నెత్తుటి చుక్కలు 
ఆశల బతుకు దీపాన్ని 
దేదీప్యమానంగా వెలిగిస్తే 
నీలాకాశం నీ అరచేతిలో           
కరెన్సీకట్టలు నీ కాళ్ళ కిందే! 

కష్ట కాలంలో 
గుడిలో శిలని కాదని 
గుండెల్లో మానవత్వాన్ని 
ఆరాధించినట్టూ... 
స్వీయ రక్తాభిషేకంతో 
ఆరిపోయే ప్రాణాలకు 
ఊపిరిపోసే అపరబ్రహ్మలు!   

అనంత బంధాలలో 
నెత్తుటి సంబంధం బలమైనట్టు                                              
అనుబంధ సుగంధా లెప్పుడూ 
అవసర సుమాల నుంచే పుట్టినట్టూ... 

ప్రసవ వేదనతో 
తల్లడిల్లే తల్లులకు  
రోగ గ్రస్త బలహీన జీవులకు                             
క్షతగాత్ర దేహాల సమూహాలలో     
రక్తాయుష్షు నింపే ప్రాణ దాన శీలురు!

నీవు దాన మిచ్చే 
ప్రతీ రక్తపు సిరా బొట్టు 
వందేళ్లు అక్షరమై జీవించినట్టు 
నీలోనే భద్రంగా దాచుకుంటే 
వంద దినాల్లో మాయమైనట్టూ... 

నీ ఒక్కని రక్తం 
ముగ్గురి ప్రాణాలు నిలబెట్టి          
నలుగురికి స్ఫూర్తి ప్రదాతవై 
రుధిర సేవా ఫలా లందించే            
ఆదర్శ దివ్య మార్గదర్శకునివి... 

కృత్రిమ ఉత్పత్తి లేని రక్తానికి                                          
మానవ దేహమే ప్రత్యామ్నాయం              
సేవాభావ సంకల్పం చాలు
మానవజన్మ సార్థకతకు!

మహోత్తర దేహశక్తిి ధారపోసి 
రక్తార్ధుల తీరని దాహం తీర్చే  
ఆపద చీకట్లలో పున్నమి చంద్రులను
రక్తదాత సుఖీ భవంటూ దీవిద్దాం!
===================================
(జూన్ 14, ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా)


కామెంట్‌లు