నీ తోక నాకు నా తోక నీకు -;- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 పిల్లలూ... గొర్రెలు భూమ్మీద ఏదో పోగొట్టుకున్నవాటిలాగా ఎప్పుడూ తలొంచుకోని వెదుకుతా వుంటాయి... అట్లాగే కోతులేమో నేల మీద కాకుండా ఎప్పుడూ చెట్ల మీదా మిద్దెల మీదా తిరుగుతా వుంటాయి. ఎందుకో తెలుసా... ఇదిగో ఈ కథ వినండి.
ఒక అడవిలో ఒక కోతి వుండేది. అది చానా పెద్ద టక్కరిది. అప్పట్లో కోతి గూడా మిగతా జంతువుల్లాగే భూమ్మీదనే తిరుగుతా వుండేది. దానిది చాలా చిన్న తోక... బెత్తెడంటే బెత్తెడు వుండేది. పొరుగింటి పుల్లకూర రుచంటారు కదా అట్లా కోతికి తన తోకంటే అస్సలు ఇష్టం లేదు. ఏ పులిలాగానో, ఎద్దులాగానో, ఆవులాగానో, గుర్రంలాగానో నాకూ పెద్ద తోకుంటే బాగుంటాది కదా అనుకునేది. తన చిన్నతోక చూసుకొని కుమిలికుమిలి బాధపడేది.
అప్పట్లో గొర్రెకి కూడా ఆవుల్లాగానే పెద్ద తోక వుండేదంట. అది తోకను అటూయిటూ వూపుకుంటా, వీపు మీద వాలిన ఈగలను, దోమలను తోలుకుంటా వుండేదంట. కోతికి దాని తోక భలే నచ్చేసింది. ఆవుకి, ఎద్దుకి తోక చివర కుచ్చులు కుచ్చులుగా వుంటే, గుర్రానికేమో తోకంతా వెంట్రుకలతో గుబురు గుబురుగా వుండేది. కానీ గొర్రె తోక అలా కాదు. సన్నగా, నున్నగా, పొడవుగా, రబ్బరులా మెత్తగా, ఎటు పడితే అటు వంగుతూ చాలా సుందరంగా వుండేది. దాంతో కోతి ఎట్లాగయినా సరే గొర్రెతోక కొట్టేయాలనుకోని ఉపాయం ఆలోచించసాగింది.
అడవిలోని జంతువులన్నిటి కంటే పరమ అమాయకమైనది, తెలివితక్కువది గొర్రెనే. దానికి కొంచం గూడా సొంతంగా ఆలోచించే బుర్ర లేదు. ఎద్దు ఈనిందంటే దూడను గాట్లో కట్టేయమనే రకం. దాంతో దీన్ని చాలా సులభంగా మోసం చేయొచ్చులే అనుకొంది.
ఒకరోజు గొర్రె దగ్గరకు వచ్చి ''ఏం గొర్రెమామా... ఎట్లా వున్నావు. బాగున్నావా'' అని పలకరించింది. గొర్రె తలాడిస్తా ''బాగున్నా అల్లుడూ... నువ్వెలా వున్నావు'' అనడిగింది. కోతి దొంగనవ్వులు నవ్వుతా తనతోపాటు తీసుకొచ్చిన జామపండ్లు దాని ముందు పెట్టి ''తిను మామా... బాగా తియ్యగా వున్నాయి. మా తోటలోనివే'' అంది. గొర్రె ఆనందంగా జామపండ్లు తినసాగింది.
అప్పుడు కోతి ఆ మాటా ఈ మాటా మాట్లాడుతా ''అవును మామా... నువ్వెప్పుడయినా తోకాట ఆడావా'' అనడిగింది. ''తోకాటనా... అంటే'' ఆశ్చర్యంగా అడిగింది గొర్రె. ''ఓరినీ... అది గూడా తెలీదా... అందుకే మామా... అడవిలో అందరూ నీకు కొంచం గూడా బుర్రలేదని ఎక్కిరిస్తా వుంటారు. ఇప్పుడు అడవిలో యాడ చూసినా ఈ ఆటే. భలే సరదాగా వుంటుందిలే. నేను గూడా నిన్నటి వరకు మన పులిమామతో ఈ ఆటనే ఆడినా'' అంది కోతి వూరిస్తా.
గొర్రె తల గోక్కుంటా ''నిజమా... నాకసలు ఈ ఆటే తెలీదే... ఎలా ఆడ్తారు'' అంది వివరాల కోసం.
''ఏం లేదు మామా... మనకు తోకలున్నాయి గదా... నాకేమో బెత్తెడుంది. నీకేమో పాములెక్క ఈంత పొడుగుంది. ఐనా ఎప్పుడూ మన తోకతో మనం తిరుగుతా వుంటే మజా ఏం వుంటుంది చెప్పు. అందుకే ఒకరి తోకలు ఒకరు మార్చుకోవాల. నేను మొన్న పులితోకతో తిరుగుతా వుంటే అడవంతా ఒకటే నవ్వులు. ఒకటే చప్పట్లు. భలే సంబరంగా వుంటాదిలే. రేపు నేను, ఆవుమామ ఒకరి తోక ఒకరు మార్చుకోవాలనుకుంటున్నాం'' అని చెప్పింది.
ఆ మాటినగానే గొర్రె ''అల్లుడూ... అల్లుడూ... ఈ ఆటేదో కొత్తగా భలేగా వుంది. నువ్వు ఆవుతో మళ్ళా మార్చుకుందువుగానీ ఈ వారం మనం మార్చుకుందామా'' అంది.
కోతి కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్లుగా నటించి ''కానీ మామా... ఆవుకి మాటిచ్చానే'' అంది.
''అల్లుడూ... అల్లుడూ... ఎలాగో ఒకలాగా దానికి ఏదో ఒకటి చెప్పు. ఈ ఒక్క వారమేలే... ఈ మామ కోసం ఆ మాత్రం చేయలేవా'' అంది గొర్రె బతిమలాడుతా.
''సరే మామా... అంతగా అడుగుతా వుంటే నీ ముచ్చట మాత్రం ఎందుకు కాదనాల్లే. దా మార్చుకుందాం'' అంటూ కోతి తన తోక తీసి గొర్రెకిచ్చింది. గొర్రె కూడా తన తోక తీసి కోతికిచ్చింది.
కోతి దాన్ని కరిపిచ్చుకోని వారం రోజులు అడవంతా సంబరంగా ఎగిరెగిరి దుంకింది. గొర్రె ఆ బెత్తెడు తోకతో అడవిలో తిరుగుతా వుంటే చూసి జంతువులన్నీ పడీ పడీ నవ్వాయి. గొర్రె అది ఆటే గదా అనుకొని తాను గూడా మురిసిపోయింది.
అట్లా వారం దాటిపోయింది. గొర్రెకు కోతి ఎక్కడా కనబల్లేదు. దాంతో దాని కోసం వెదుక్కుంటా బైలు దేరింది. కోతి ఆ గొర్రె తోకను ఒక చెట్టుపైన దాచిపెట్టి ముఖం విచారంగా పెట్టి చెట్టు కింద కూర్చుంది. గొర్రె ఆ తోకలేని కోతిని చూసి ''ఏం అల్లుడూ... అట్లా వున్నావు. నా తోకేది'' అని అడిగింది. దానికా కోతి దొంగ ఏడుపులు ఏడుస్తా, ''నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు మామా... నిన్న ఆడుకుంటా వుంటే ఎప్పుడు పడిపోయిందో, ఎట్లా పడిపోయిందో గానీ నీ తోక ఎక్కడో గడ్డిలో పడిపోయింది. ఎంత వెదికినా దొరకడం లేదు'' అంది.
దానికా గొర్రె ''అరెరే... మరెలా'' అంది.
''మామా... నువ్వూ వెదుకు. నేనూ వెదుకుతా... తప్పు నాదే కాబట్టి నీ తోక తిరిగి దొరికే వరకు నా తోక నువ్వే వుంచుకో. దొరగ్గానే తిరిగి మార్చుకుందాం. అంతవరకు నా ముఖం గూడా నీకు చూపియ్యను'' అంటూ వెళ్ళిపోయింది.దాంతో పాపం... ఆ బుర్రలేని గొర్రె దించిన తల ఎత్తకుండా ఎక్కడ బడితే అక్కడ తోక కోసం వెదుకుతానే వుంది. కోతేమో హాయిగా గొర్రెతోక తగిలించుకోని కింద తిరిగితే దానికి ఎక్కడ కనబడతానో ఏమో అనుకోని చెట్లమీదా, మిద్దెలమీదా హాయిగా కులుక్కుంటా తిరగసాగింది.
***********

కామెంట్‌లు