అమ్మకంటే నాన్న వెనుకబడలేదు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అందరూ అనుకుంటున్నట్లు
అమ్మకంటే నాన్న వెనుకబడలేదు
అమ్మ ఎంతో నాన్న అంతే
ఆ ఇద్దరూ దేవతాసమానులే

కనినందుకు
కడుపునింపినందుకు అమ్మ ఎంతో
పెంచినందుకు పోషించినందుకు
నాన్న అంతే

ఉయ్యాలలోవేసి ఊపినందుకు
జోలపాటపాడి నిద్రపుచ్చినందుకు అమ్మ ఎంతో
భుజాలమీద ఎక్కించుకొని త్రిప్పినందుకు
బడిలోచేర్చి చదివించినందుకు నాన్న అంతే

ఉన్నత ఉద్యోగము వచ్చినపుడు
పదవినందు ఉన్నతిపొందినపుడు
పరవశించిపోయిన అమ్మ ఎంతో
పొగిడి గర్వించిన నాన్న అంతే

చక్కనిచుక్కను పెళ్ళిచేసుకున్నప్పుడు
మహలక్ష్మిగా కోడలనింటికితెచ్చినపుడు
ముచ్చటపడిన అమ్మ ఎంతో
మురిసిపోయిన నాన్న అంతే

వంశోద్ధారకుడు మనమడు పుట్టినపుడు
అందాలబొమ్మగా మనుమరాలు జనించినపుడు
ఎత్తుకొని ముద్దాడిన అమ్మ ఎంతో
ఎగిరిగంతులేసి మిఠాయీలుపంచిన నాన్న అంతే


కామెంట్‌లు