కవులరాతలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అల్లిబిల్లి రాతలన్నీ
ఆనందంకోసమే
ఆస్వాదిస్తారా

జిగిబిగి కూర్పులన్నీ
జాగృతిపరచటానికే
జీర్ణించుకుంటారా

హడావుడి గీతలన్నీ
హాయినివ్వటంకోసమే
అందుకుంటారా

చకచకాపేర్చటాలన్నీ
సాహితీప్రియుల సంతసానికే
స్వీకరిస్తారా

కవనకుసుమాలన్నీ
తలలకెక్కించటానికే
తెలుసుకొని తృప్తినిపొందుతారా

కైతలసౌరభాలన్నీ
కవితాభిమానులపై చల్లటానికే
క్రోలుకొని కుతూహలపడతారా

అంతరంగ ఆలోచనలన్నీ 
అందమైన కవితకోసమే
అర్ధంచేసుకొని అభినందిస్తారా

అక్షరాల అమరికలన్నే
మస్తకాలను తట్టటానికే
మదిలో నిలుపుకుంటారా

పదాల ప్రయోగాలన్నీ
పరవశపరచటానికే
పరమార్ధాలను గ్రహిస్తారా

వ్రాసిన కవితలన్నీ
పాఠకులకోసమే
పఠించి పులకిస్తారా

వాక్యాల విక్రమాలకు
విలువను ఇవ్వండి
కవితల కళాత్మకతలకు
ఖరీదును కట్టండి


కామెంట్‌లు