శంభో!' శతకపద్యములు ;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 కందములు.
==========
11.
అదనుగ నీ సేవలనే
వదలక చేసెద నిరతము పావన మూర్తీ !
ముదముగ నీ రూపము నే 
హృదయము నందున నిలిపితి హృష్ఠిగ శంభో !//
12.
ఢమరుక నాదవిలోలా !
సుమశరరిపు హర !విలాసి సురముని వంద్యా !
నమతులు గొనుమా భర్గా !
శమదమముల నీయ రార !సరగున శంభో !//
13.
నాగాభరణా !భద్రా !
వాగీశ వినుత !నినుగన వచ్చితి నయ్యా !
భోగాలను కోరను నే 
నీ గాథలు విని తరింతు నిష్ఠగ శంభో !//
14.
భవహర !నీదు మహిమలను 
గవులును మునులును భజించి గానము చేయన్ 
జవులూర విని మురిసి నే 
గవనము చెప్పెద దరింప ఘనముగ శంభో !//
15.
 జగముల నేలెడి దేవర !
జగదంబను గూడి రార !చంద్రధరా !నా 
దిగులును మాన్పగ లేవా !
యగణిత వరగుణనిధి !శివ !హరహర !శంభో !//

కామెంట్‌లు