అయిదుగురెందుకు?;- - యామిజాల జగదీశ్

 అది టిబెట్టులోని ఓ లోయ ప్రాంతం. ఆ లోయలో సేవలు చేస్తున్న ఓ లామా తానుంటున్న ఆశ్రమానికి మరొక లామా అవసరముందని ఓ ప్రకటన చేశారు. అంతేకాదు, ప్రధాన ఆశ్రమానికి ఓ లేఖ కూడా రాశారు. ప్రధాన ఆశ్రమ మతగురువు ఈ ఉత్తరాన్ని అక్కడి శిష్యులందరికీ చదివి వినిపించారు. అనంతరం, ఆయన ఓ అయిదు మందిని ఎంపిక చేసి వారిని ఆ లోయప్రాంతానికి పంపాలని నిర్ణయించారు. అయితే ఓ లామా అక్కడి లామా ఒక్కరిని మాత్రమే కదా కావాలన్నారని ప్రశ్నించాడు.
అయితే ఈ ప్రధాన గురువు ఎందుకు అయిదు మందిని పంపదలచుకున్నానో మీకు ఆ తర్వాత అర్థమవుతుందన్నారు. తాను అయిదు మందిని పంపుతున్నా వారిలో ఒక్కరైనా అక్కడికి చేరుతారనే హామీ లేదన్నారు. ఎందుకంటే దారి మరీ దీర్ఘమైనదీనూ, దారి మధ్యలో ఎన్నయినా చిక్కులు రావచ్చు అని చెప్పారు.
అందరూ నవ్వారు. ఈ వయసైన మతగురువుకు మతి చెడిందని అనుకున్నారు. ఒక్కరు కావాలని అక్కడి లామా అడగ్గా ఈయన అదు మందిని పంపడమేంటని వులు కొరుక్కున్నారు. అయినా మతగురువు చెప్పిన మాటను జవదాటకుండా ఆయన ఎంపిక చేసిన ఐదుగురూ బయలుదేదారు.
వారు ఓ గ్రామం చేరేసరికి ఆ గ్రామ పెద్ద నుంచి ఓ ఉత్తరం వారికి తీసుకొచ్చాడు. తమ గురువు మరణించాడన్నదే ఆ సమాచారం. కనుక మీ అయిదుగురిలో ఎవరు తమకు గురువుగా ఉన్నా వారికి మంచి సౌకర్యాలే కల్పిస్తామని చెప్పారు. ఆ గ్రామం సస్యశ్యామలమై ఉండడంతో అయిదుగురిలో ఒకరు తానక్కడ గురువుగా ఉండిపోతానని చెప్పాడు. ఇక్కడ సేవ చేసినా అది బుద్ధుడికి చేసే సేవ అవుతుంది కనుక తానేమీ ఆ లోయ ప్రదేశానికి రానక్కర్లేదని అఁటూ అక్కడే ఆగిపోయాడు. దీంతో అయీదుగురిలో ఒకరక్కడే ఆగిపోయారు. ఇప్పుడు నలుగురు ఉన్నారు. వారు మరుసటి రోజు ఒక నగరం గుండా పోతున్నారు. అప్పుడు ఆ మార్గంలో ఆ నగర పాలకుడు గుర్రం మీద వస్తున్నాడు.  నలుగురు లామాలలో ఒకడు ఎంతో ఆరోగ్యంగానూ, అందంగానూ ఉన్నాడు. రాజు వారిని ఆపాడు. నేను నా కూతురుకోసం ఓ అందగాడిని వెతుకుతున్నాను, మీ నలుగురూ చూడ్డానికి బాగున్నారు. కానీ నాకున్నది ఒక్క కూతురే. కనుక మీలో ఒకరు ముందుకొచ్చి తన కుమార్తెను పెళ్ళి చేసుకోవాలన్నాడు.  అయితే ఆ నలుగురిలో అందంగా ఉన్న ఒకడు తాను ఇక్కడే ఆగిపోయ. రాజు వెంట వెళ్ళి వాళ్ళ కూతురుని పెళ్ళాడదలచుకున్నానని చెప్పాడు మనసులోని మాటను చెబుతూ. ఇంకేముంది ఇప్పుడు నలుగురిలో ఒకడు ఆగిపోయాడు. ఇప్పుడు ముగ్గురు మిగిలారు. దీంతో ఆ ముగ్గురుకీ ఓ విషయం అర్థమైంది. తమ గురువుని పిచ్చి వాడనుకున్నాం కానీ ఆయన దూరదృష్చితో ఎందుకు అయిదుగురిని ఎంపిక చేసి పంపారో బోధపడింది. దారిలో ఏవైనా అడ్డంకులు రావచ్చని చెప్పడం కూడా గుర్తుకొచ్చింది.
మిగిలిన ముగ్గురూ దారిమధ్యలో  దేనికీ మనసు మార్చుకోకూడదనుకున్నారు.  ఆ ముగ్గురూ తమ ప్రయాణం సాగించారు. మార్గమధ్యంలో ఓ అడవిలోకి ప్రవేశించారు. అక్కడ వారు దారి తప్పారు.
దూరంగా ఒక కొండ కనిపించింది. దాని మీద ఓ దీపం వెలగడం చూసి అక్కడికి చేరుకున్నారు.
అదొక ఇల్లు. అక్కడ ఓ యవ్వనవతి ఉంది. ఆమె వీరిని చూడగానే మీరు ఆ దేవుడు పంపగా ఇక్కడికి వచ్చారని తెలుస్తోంది. మా అమ్మానాన్నలు బయటకు వెళ్లారు. కానీ వారిద్దరూ ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. నాకు ఒంటరిగా ఉండడానికి భయం వేస్తోంది. అయితే మీరు ఆ దేవుడు పంపిన దూతలుగా అనిపిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాకెంతో ధైర్యంగా ఉంది. మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. నా తల్లిదండ్రులు వచ్చేవరకూ మీరిక్కడ బస చేయవచ్చు అని చెప్పిందా యవ్వనవతి. సరేనని ఆ ముగ్గురు ఆ రాత్రికి అక్కడే ఉన్నారు. మమ్మల్ని ఆలోచించుకోనివ్వు అన్నారు.
రాత్రి పడుకుండిపోయారు. మరుసటిరోజు తెల్లవారైంది. ముగ్గురిలో ఒకడు ఆ అమ్మాయి సౌందర్యానికి ముగ్ధుడై అక్కడ ఉండిపోవాలనుకున్నాడు. ఈ నిర్ణయాన్ని మిగిలిన ఇద్దరికీ చెప్పి తానిక ఇక్కడి నుంచి రానని కచ్చితంగా చెప్పాడు.
ఇక చేసేదేమీలేక మిగిలిన ఇద్దరు అక్కడి నుంచి ఒక్క మాటా అనకుండా బయలుదేరారు.
ఆ ఇద్దరూ గట్టిగా అనుకున్నారు. ఎవరేం చెప్పినా తాము మనసు మార్చుకోబోమని టిబెట్టు లోని లోయప్రాంతానికి వెల్ళవలసిందేనని అనుకున్నారు. వారిద్దరూ కృతనిశ్చయంతో బయలుదేదారు.
 ఈ ఇద్దరూ ఒక గ్రామంలోని కొందరికి చిక్కారు. వారికి కోపమెక్కువ.  వారిలో ఓ పండితుడు, మీరు బుద్ధుడు చెప్పినవన్నీ నిజమనుకుంటే దానిని నిరూపించాలని సవాలె విసిరారు.
ఇద్దరిలో ఒకడికి పౌరుషమొచ్చి తాను నిరూపిస్తానని చెప్పాడు. ఈ నిరూపించడం కోసం కొంత కాలం పడుతుందని కనుక తానిక్కడే ఉండిపోతానని తన తోటి లామాతో చెప్పాడు.
ఎంతకాలమైనా సరే తాను రానని కరాఖండిగా చెప్పాడు. దాంతో ఆయిదుగురిలో ఒక్కడుగా మిగిలిన అతను ఏ మాత్రం మనసుమార్చుకోకుండా లోయప్రాంతానికి చేరాడు. అక్కడి లామాకు అన్ని విధాల సహకరించి పేరుప్రఖ్యాతులు సంపాదించాడు.  
 ఇప్పుడు ఆ లామాకు అర్థమైంది, తమ గురువు ఎందుకు అయిదుగురుని పంపాడో బోధపడింది.

కామెంట్‌లు